సమంతకు మయోసైటిస్.. ఏమిటా వ్యాధి ?

సమంతకు మయోసైటిస్.. ఏమిటా వ్యాధి ?

తాను కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ ప్రముఖ హీరోయిన్ సమంత వెల్లడించారు.  చేతికి సెలైన్ పెట్టుకున్న ఓ ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చేతికి సెలైన్‌తో యశోద సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన సమంత సుదీర్ఘంగా పోస్ట్‌ను రాసుకొచ్చింది. అందులో ఆమె ప్రస్తావించిన మయోసైటిస్ వ్యాధి అంటే ఏమిటి ? దాని బారినపడే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి ? అది ఎందుకు వస్తుంది ? ఇప్పుడు తెలుసుకుందాం. 

మయోసైటిస్ వస్తే ఏమవుతుంది ?

  • ‘మయోసైటిస్‌’ ఒక అరుదైన వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌.  దీన్ని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా చెప్పొచ్చు. 
  • మయోసైటిస్ లో ఐదు రకాలు ఉన్నాయి. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్ (బాలలు), పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే రకాలు ఉన్నాయి. 
  • ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టమే. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. 
  • ‘పాలీ మయోసైటిస్‌’ బారినపడే వారు చిన్నచిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి కిందపడిపోతారు. 
  • ‘డెర్మటో మయోసైటిస్‌’తో బాధపడేవారికి కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 
  • ‘ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటిస్‌’ కారణంగా నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. 50 ఏళ్ల వయసు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. హీరోయిన్  సమంత వీటిలో ఏ రకం మయోసైటిస్ తో బాధపడుతున్నారో తెలియరాలేదు. 
  • అమెరికాలో ఏటా కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు ‘మయోసైటిస్‌’  కేసులు  నమోదవుతుంటాయి. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా. 

ఎందుకు వస్తుంది ? 

మయోసైటిస్ వ్యాధి ఎందుకొస్తుంది ?  అనే విషయంలో నిపుణుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇదొక ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌ కావడం వల్ల .. శరీరం కండరాలపై దాడి చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇది ఎందుకు వచ్చిందనే కారణాన్ని సైతం తెలుసుకోలేం. అయితే గాయం, ఇన్ఫెక్షన్ వంటివి ఈ వ్యాధి రావడంలో కీలక పాత్రను పోషిస్తాయనేది మాత్రం విస్పష్టం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు, సాధారణ జలుబు, ఫ్లూ, హెచ్ఐవీ వంటి వైరస్ లు, విషపూరిత ఔషధాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు ఉంటుంది. ఈ వ్యాధి బారినపడిన వారు తగిన వైద్య చికిత్స పొందాలి. ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి కూడా చేయడం మంచిది.  

సమంత ట్వీట్ లో ఏముంది ? 

 "మీ అందరి ప్రేమ ఇచ్చిన ధైర్యంతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నాను. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నాను. ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నా.  కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధి నాకు సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మీకు చెబుతున్నాను. అయితే ప్రతీ విషయాన్ని ఇలా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నా భావన. త్వరలోనే నేను ఈ సమస్య నుంచి బయటపడతానని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు" అని  లవ్ ఎమోజీని సింబాలిక్ గా పెట్టి సమంత పోస్ట్ చేశారు. సమంత వ్యాధి గురించి  తెలియడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.