సినీ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయిన విషయాన్ని ఆమె వెల్లడించినప్పటికీ మరణానికి కారణం ఏంటనే విషయం వెల్లడించలేదు. ఆయన కార్డియాక్ అరెస్ట్తో మరణించినట్లు తాజాగా తెలిసింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గుండె అసాధారణ రీతిలో కొట్టుకుని ఆగిపోయింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆంగ్లో-ఇండియన్ తెలుగు వ్యక్తి. ఆయన భార్య ఒక సిరియన్ మలయాళీ.
వీరికి సమంతతో పాటు జోనాథన్ ప్రభు, డేవిడ్ ప్రభు అనే ఇద్దరు కుమారులున్నారు. సమంతకు ఈ ఇద్దరూ అన్నయ్యలు. నాగచైతన్యతో ప్రేమ పెళ్లికి తొలుత తటపటాయించినప్పటికీ కూతురి ఇష్టాన్ని కాదనలేక ఆమె తండ్రి పెళ్లికి అంగీకరించారు. చైతూ, సామ్ విడిపోయిన సందర్భంలో కూడా సమంత తండ్రి వీరి విడాకులపై స్పందించారు.
ALSO READ | సమంత నాన్న చనిపోయారు.. గుండె బద్ధలైందంటూ సామ్ ఎమోషనల్
అనగనగా ఒక కథ ఉండేదని, ఇప్పుడు ఆ కథ ముగిసిపోయిందని.. మరో కొత్త కథతో, కొత్త అధ్యాయంతో జీవితం మొదలుపెట్టాలని తన కూతురుని ఉద్దేశించి ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 2017లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సమంత, నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకోవడంతో ఈ ఇద్దరి దారులు వేరైపోయాయి.
కూతురి వైవాహిక జీవితం ఇలా ముగియడంతో సమంత తండ్రి ఆవేదన చెందినప్పటికీ సమంతకు ధైర్యం చెప్పి జీవితంలో ఇలాంటి ఆటుపోట్లను దాటుకుని ముందుకు సాగాలని సూచించారు. జీవితం అనేది చాలా చిన్నదని, భావోద్వేగాల్లో చిక్కుకుని బాధపడుతూ కూర్చోకూడదని సమంతకు చెప్పారు.