కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం లేదు

ఖమ్మం రూరల్, వెలుగు: కమ్యూనిజానికి ప్రత్యామ్నాయ శక్తి లేదని, భవిష్యత్తులో రాదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ జిల్లా సమితి చేపట్టిన ప్రజా పోరుయాత్ర ముగింపు సభ శుక్రవారం మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో జరిగింది. పెద్దతండా నుంచి తరుణి హాట్ వరకు వేలాది మందితో ర్యాలీ తీశారు. సభలో కూనంనేని, తమ్మినేని మాట్లాడుతూ దేశ సంపదను ద్రోహులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

అవకాశవాద రాజకీయాలు చేసేవారు విమర్శలు చేస్తే కమ్యూనిస్టులు సహించబోరని హెచ్చరించారు. డబ్బుతో డబ్బు కోసం జరిగే సమ్మేళనాలు ఏ రకం ఆత్మీయ సమ్మేళనాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే వారికి ఈ సభ సమాధానం చెబుతుందన్నారు. సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, లీడర్లు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్ రెడ్డి, సిద్దినేని కర్ణికుమార్, గోవిందరావు, పుచ్చకాయల కమలాకర్, సుధాకర్, పగిళ్ల వీరభద్రం పాల్గొన్నారు.