కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదు: కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్​వర్కర్లను నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. కొత్తగూడెం బస్టాండ్​సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెలో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరన్నారు.

 సమస్యలను పరిష్కారించాలని కోరుతూ అంగన్​వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సీపీఐ, సీఐటీయూ నాయకులు వై.శ్రీనివాస్​రెడ్డి, డి.వీరన్న, కళావతి, పద్మావతి, శైలజ, జయ, లక్ష్మి పాల్గొన్నారు.

తల్లాడ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తల్లాడలో ఆశా వర్కర్లు గురువారం ర్యాలీ నిర్వహించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్​చేశారు. ర్యాలీకి సీపీఎం మండల నాయకులు సంఘీభావం తెలిపారు. చెవిలో పూలు పెట్టుకొని ఆశాల నిరసన

ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. గురువారం దీక్షా శిబిరంలో చెవిలో పూలు పెట్టుకుని ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా ధనలక్ష్మి మాట్లాడుతూ... తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆశా వర్కర్ల సమ్మెకు సంపూర్ణ సంఘీభావం తెలిపింది. కార్యక్రమంలో కొర్రి పద్మ, ఇందిర, సుజాత, నాగలక్మి, కుమారి తదితరులు 
పాల్గొన్నారు.