లక్నో: కరెంటు చోరీ కేసులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ కు ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రూ.1.91 కోట్ల జరిమానా విధించింది. రెండు ఎలక్ట్రిసిటీ మీటర్లను ట్యాంపర్ చేసి కరెంట్ వాడుకున్నందుకు ఆ మొత్తాన్ని చెల్లించాలని శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
అంతకుముందు సంభాల్‌లోని ఎంపీ నివాసంలో విద్యుత్తు శాఖ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు. ఆయన నివాసంలో అక్రమ పవర్ సప్లైని గుర్తించారు. దీంతో ఎంపీ ఇంటికి కరెంటు కట్ చేశారు. అక్రమంగా కరెంటు వాడుకున్నందుకు ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1948 కింద కేసు నమోదు చేశారు.
‘‘ఎంపీ జియా ఉర్ రెహమాన్ నివాసంలో రెండు కిలోవాట్ల కెపాసిటీ గల ఎలక్ట్రిసిటీ మీటర్లను రెండు గుర్తించాం. వాస్తవానికి ఎంపీ నివాసానికి 8 నుంచి 10 కిలోవాట్ల కెపాసిటీ గల మీటర్ల అవసరం. కానీ, ఆయన అంతకన్నా తక్కువ సామర్థ్యం గల మీటర్లు వాడుతూ కరెంటు చోరీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ మీటర్లను తొలగించాం. ఎంపీకి నోటీసులు అందజేశాం” అని అధికారులు తెలిపారు.