కేసీఆర్ రూపంలో అదే అణచివేత ... మరో విమోచనం అవసరం

 కేసీఆర్ రూపంలో అదే అణచివేత ... మరో విమోచనం అవసరం

తెలంగాణ ప్రాంతానిది ఒక కన్నీటి గాథ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కానీ.. ఈ కోటి రతనాల వీణను దోచుకున్న దొరలెందరో. మొదట మొఘలాయులు, అసఫ్​జాహీలు, నిజాములు, జమీందార్లు, దొరలు, గడీలు , తర్వాత సీమాంధ్ర పాలన, తొలి దశ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలి, మలి దశ ఉద్యమంలో 1200 ఆత్మబలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ, మళ్ళా ‘వైకుంఠపాళి’ ఆటలాగ కేసీఆర్ రూపంలో అదే అణచివేత పాలన.  

రైతాంగ విమోచన పోరాటం 

ఆంధ్ర మహా సభ ద్వారా కమ్యూనిస్టు పార్టీ, మేధావులు, స్వామి రామానంద తీర్థ లాంటి వారు, నిజాం తాబేదార్లు అయిన దొరల గడీలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు.  జులై 4,1946 లో జనగామ జిల్లా కడవెండి గ్రామంలో దేశముఖ్ విసునూరి రామ చంద్ర రెడ్డి కి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంలో దొడ్డి కొమరయ్య అనే సంఘ సభ్యుడిని దొర రౌడీ ముస్కాన్ అలీ జరిపిన కాల్పుల్లో మరణించగా, అప్పటి నుంచి అహింసా ఉద్యమం రైతాంగ సాయుధ పోరాటంగా మారింది. పాత సూర్యాపేట, నల్గొండ, ఇతర ప్రాంతాల్లో నిజాం మిలిటరీ, పోలీస్ సంఘాల మీద విరుచుక పడ్డారు.  శివాజీ చాల విజయవంతంగా నడిపిన గెరిల్లా పద్దతిని అప్పుడు సంఘాలు ఎంచుకున్నాయి.  1948 నుంచి మొత్తం తెలంగాణలో  ఒక కల్లోల పరిస్థితి. ఒక వైవు నిజాం సైన్యం, పోలీసు, అంత కంటే ఎక్కువ రజాకార్లు, వారికి సహకరించిన దొరలు, జమీందార్లు, ఇంకో వైపు కమ్యూనిస్టు దళాలు ( ప్రత్యేక కమ్యూనిస్టు దేశంగా మార్చాలని తపన), కాంగ్రెస్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న రామానంద తీర్థ లాంటి వారు, గాంధేయవాద కాంగ్రెస్ , హిందువుల తరపున ఆర్య సమాజ్, హిందూ మహా సభ ఇలా తెలంగాణ సమాజం సతమతం అయ్యింది.  అప్పటి  పరిస్థితులకు మా నాన్న ప్రత్యక్ష సాక్షి. రజాకార్ల భయంతో మహిళలు, పిల్లలు పొలం దగ్గర కొట్టంలోకి మకాం మార్పు. నగలు, ఇతర సొమ్ము పాతి పెట్టడం, తానూ , తన తమ్ముళ్లు, ఇతరులు కలసి  తుపాకీతో రాత్రిళ్ళు మా సొంతూరు సూర్యాపేటకు కాపలా ఉండేది.

విమోచన తదుపరి..

దొరలు, జమీందార్లు మళ్లీ మూడు రంగుల కండువా కప్పుకొని గడి నుంచి అసెంబ్లీకి చేరారు. నిజాం ఎంచక్కా తన సిరి సంపదలు, ఆస్తి పాస్తులకు  ఢోకా లేకుండా తెలంగాణ ప్రాంతానికి రాజ్ ప్రముఖ్ గా నియమితులు అయ్యారు. రజాకార్లు అనే క్రూరమైన  సంస్థను స్థాపించి వేలాది మంది హత్యలకు, మానభంగాలకు కారణం అయినా  ఖాసీం రిజ్విని కేవలం ఒక చైన్ స్నాచర్ లా కొద్ది రోజులు జైల్లో పెట్టి, సాదరంగా పాకిస్తానుకు స్పెషల్ ఫ్లైట్ లో సాగనంపారు. ఇక రైతాంగ పోరాటంలో దొరల భూములను దక్కించుకున్న బలహీన వర్గాలను తన్ని తరిమివేసారు. గడి అసెంబ్లీ అయ్యింది, మిగతావన్నీ సేమ్ టు సేమ్. తెలంగాణ రాష్ట్రం  మూన్నాళ్ళ ముచ్చటే అయింది.1953 లో ఎన్నికలు , కేవలం 3 ఏండ్లు తెలంగాణ స్వతంత్రంగా ఉంది. కానీ కొంటె పిల్లగాడు అయిన ఆంధ్ర నాయకత్వం, సోయిలేని తెలంగాణ నాయకత్వం వలన అమాయక తెలంగాణ ఆంధ్రతో కలిపి నవంబర్ 1 , 1956 లో ఆంధ్ర ప్రదేశ్ అయ్యింది. మళ్లీ పరాయి పాలన, తెలంగాణ నాయకులూ ఆరో  వేలు అయ్యారు. 

ముల్కి ఉద్యమం, తొలి, మలి దశ ఉద్యమాలతో, బలిదానాలతో 2014 జూన్ 2 న తెలంగాణ ప్రాంతానికి విముక్తి. కాశీకి పోయినా శనేశ్వరం వదలలేదు అన్నట్లు మొదట్లో మొగలాయిలు, అసీఫ్ జాహీలు, నిజాములు, సీమాంధ్ర పాలకులు , ఇప్పుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, దొరలు, నిజాములు కలయికతో ఏర్పడ్డ ఒక తెలివైన బ్రీడ్. తెలంగాణ ప్రజల పరిస్థితి సేమ్ టు సేమ్. మరో విమోచన తప్పదు. నలుగురు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య ఒక అంతర్యుద్ధం. ఇక తెలంగాణ తుది దశ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు శాశ్వత విముక్తికి తహతహ లాడుతున్నారు. యాదృచ్చికమే కావొచ్చు కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ  జన్మ దినం కూడా సెప్టెంబర్ 17 కావడం విశేషం. తెలంగాణ ప్రాంత విముక్తికి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఇప్పుడు నరేంద్ర మోదీ సహకారం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొందరి తెలంగాణ కాదు, ఇది అందరి తెలంగాణ కాకతప్పదు.

పటేల్ సాహసం
 
ఫిబ్రవరి 1947 లో బ్రిటిష్  భారత్ ను వదిలి వెళ్లడానికి నిర్ణయం తీసుకొని, అప్పుడు వివిధ రాజ్యాలను, సంస్థానాలను భారత్ లో కలపవచ్చు, పాకిస్తాన్​లో కలవొచ్చు లేదా తాము స్వతంత్రంగా ఉండవచ్చు అనే ఫిట్టింగ్ పెట్టారు. అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్​, స్వామి రామనంద తీర్థ భారత్ లో  కలవాలని, అదే సమయంలో రష్యాను ఆదర్శంగా తీసుకున్న కమ్యూనిస్టులు రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ని కలిసి మాకు ఆయుధాలు ఇవ్వండి తెలంగాణ  ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించు కుంటాం అని ప్రతిపాదన పెడితే, స్టాలిన్ తిరస్కరిస్తే తిరోగమనం పట్టారు. 

ఈ లోపు నిజాం - ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా లేదా పాకిస్తాన్​తో కలపాలని కుట్రలు మొదలు పెట్టారు. ఇంత జరుగుతున్నా మొత్తం తతంగం  చూస్తున్న అప్పటి ప్రధాన మంత్రి జవహర్​లాల్ నెహ్రూ పాలసీ పారలాసిస్ పక్కకు పెట్టి హోమ్ మినిస్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢనిర్ణయం తీసుకొని ఆపరేషన్ పోలో ద్వారా13 సెప్టెంబర్ లో మొదలు పెట్టి 17 సెప్టెంబర్ అంటే కేవలం 5 రోజుల్లో హైదరాబాద్ స్టేట్ ను  రజాకార్ల, నిజాం పాలన నుంచి విముక్తి కల్గించారు.   


- బూర నర్సయ్య గౌడ్​. మాజీ ఎంపీ భువనగరి