గ్రేటర్లో కంట్రోల్ అవ్వని కరోనా
మార్చి 2 న మొదటి కేసు
ఇప్పటివరకు అధికారికంగా 51వేల మందికిపైగా పాజిటివ్
లెక్కకి రాని కేసులు వేలల్లో..
నిర్లక్ష్యం వీడని బల్దియా
హైదరాబాద్, వెలుగు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సిటీలో మకాం వేసి ఆరు నెలలవుతోంది. మార్చి రెండున తొలి కేసు నమోదైంది. సిటీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుబాయ్‌లోని కంపెనీలో హాంకాంగ్వాసులతో కలిసి పని చేయడం వల్ల వైరస్ బారిన పడ్డారు. ఇలా వేరే దేశం నుంచి మొదట సిటీలోకి వైరస్ ఎంటర్ అయింది. అదే నెల 14న మరో రెండు కేసులు వచ్చాయి. మొత్తంగా ఆరు నెలల్లో 51వేలకిపైగా నమోదైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆగస్టులో వైరస్ వ్యాప్తి, కేసులు తగ్గుతాయని హెల్త్ మినిస్టర్, డీఎంఈ చెప్పగా, అదే నెలలో 12,791 కేసులు వచ్చాయి. వాస్తవానికి అంతకు మించే కేసులున్నా బులిటెన్‌లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కలు పలుమార్లు స్పష్టం చేశాయి. కరోనా కట్టడి కోసం సెంట్రల్టీమ్ ఆదేశాలతో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేసిన నిర్వహణను బల్దియా గాలికొదిలేసింది.
6లక్షలు దాటాయన్న సీసీఎంబీ…
ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో మార్చిలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌లో 519, మేలో 876, జూన్ లో 11,080, జూలై లో 26,082, ఆగస్టులో 12791 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంతకు మించే కేసులు వస్తున్నా, లెక్క తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్లో 6 లక్షల మందికిపైనే కరోనా వచ్చినట్లు సెంటర్‌ఫర్ సెల్యులర్అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) గత నెలలోనే పేర్కొంది. జిల్లావైద్యాధికారులు, సర్కారు బులిటెన్ లెక్కలకు తేడాలు కూడా చాలాసార్లు బయటపడ్డాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్లలో రద్దీ ఎక్కువ ఉండడం, వివిధ కారణాలతో టెస్టులు చేయకపోవడంతో చాలామంది ప్రైవేట్‌లో టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు ల్యాబ్ టెక్నిషియన్లను ఇంటికే పిలిపించుకుని శాంపిల్స్ ఇస్తున్నారు. ఆ లెక్కలేవీ పూర్తిస్థాయిలో యాడ్ అవడం లేదు.
కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ అంతంతమాత్రమే..
కరోనాను కంట్రోల్ చేసుందుకు ఏప్రిల్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా 12 ఏరియాల్లో బల్దియా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేసింది. ఆ తర్వాత కూడా కేసులు ఎక్కువగా వస్తుండడంపై హైకోర్టు, సెంట్రల్ టీమ్ సీరియస్ అవడంతో వాటి సంఖ్యను 92కి పెంచింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 65 కంటైన్మెంట్ జోన్లు యాక్టివ్ గా ఉన్నాయి. వాటి పర్యవేక్షణకు కమిషనర్ ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. అయినా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో ఆ ఏరియాల్లో పాజిటివ్ పేషెంట్లు కూడా బయటికి వస్తున్నారు. హోం క్వారంటైన్ అయ్యేందుకు ఇంట్లో వసతి లేని వాళ్ల కోసం ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని హై కోర్టు ఆదేశించినా, ఇప్పటిదాకా 4 సెంటర్లు మాత్రమే ఏర్పాటుచేశారు. దాంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అన్‌లాక్ మొదలవడం, అధికారులు చేతులెత్తేయడంతోపాటు జనం రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండటంతో గ్రేటర్ లో కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి.