- సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు
- త్వరలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్స్ ఫైల్ చేస్తామని వెల్లడి
- విజయ్ నాయర్‌కు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
- డిసెంబర్ 12కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి చార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. 3 వేల పేజీలతో కూడిన ఈ చార్జ్‌షీట్‌ను శనివారం ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ ఆఫీసర్లు ఫైల్ చేశారు. ఇందులో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు పేరును ఏ1గా చేర్చారు. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా పలు కంపెనీల పేర్లను పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 45 కింద సమీర్ మహేంద్రుతో పాటు మరో ఇద్దరి పేర్లను చార్జ్ షీట్‌లో పొందుపరిచినట్లు ఈడీ తరపు న్యాయవాది నవీన్ కుమార్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్స్ ఉన్నాయని బెంచ్‌కు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సమీర్ మహేంద్రు తరపు న్యాయవాది.. ఇప్పటికే అన్ని వివరాలను ఈడీకి సమర్పించినట్లు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్.. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసును డిసెంబర్ 12కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి సమీర్ మహేంద్రునే. సెప్టెంబర్ 27న మనీ ల్యాండరింగ్ కేసులో సమీర్ మహేంద్రుని అదుపులోకి తీసుకుంది. అరెస్టు తర్వాత 60 రోజుల చట్టబద్ధమైన గడువు శనివారంతో ముగియడంతో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం సీబీఐ కూడా చార్జ్‌షీట్ ఫైల్ చేసింది.
సమీర్ భార్య పిటిషన్ కొట్టివేత
ఈడీ అధికారులు తన భర్తను, తనను వేధిస్తున్నారని సమీర్ మహేంద్రు భార్య వేసిన పిటిషన్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు కొట్టివేసింది. పారిస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తనను ఈడీ అధికారులు ఎయిర్ పోర్ట్‌లో వేధించారని, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సమాచారం పేరుతో తీహార్ జైలులో తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శనివారం జడ్జి నాగ్ పాల్ విచారణ జరిపారు. వాదనలు వినిపించిన ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్.. సమాచారం పేరిట ఎవర్నీ ఇబ్బంది పెట్టడం లేదని వాదించారు. జోక్యం చేసుకున్న జడ్జి నాగ్ పాల్.. ఎయిర్ పోర్టులో, తీహార్ జైలులో సీసీ కెమెరాలు ఉంటాయని, వేధింపులు జరిగినట్లు సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
విజయ్ నాయర్ కస్టడీ పొడిగింపు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గతంలో విధించిన 12 రోజుల కస్టడీ ముగియడంతో శనివారం ఈడీ అధికారులు విజయ్ నాయర్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. లిక్కర్ కేసులో విజయ్ నాయర్ పాత్ర ఉందని, మనీ ల్యాండరింగ్ గురించి ఇంకా సమాచారం సేకరించాల్సి ఉందని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. తర్వాత కేసు విచారణను డిసెంబర్ 8కి కోర్టు వాయిదా వేసింది. దీంతో ఈడీ అధికారులు నాయర్‌ని తీహర్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ పెట్టిన కేసులో స్పెషల్ కోర్టు ఈ నెల 14న విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే వెంటనే ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు మరో ఐదు రోజులు, తర్వాత రెండు రోజులు పొడిగించింది. తాజాగా మరో 13 రోజులపాటు కస్టడీ విధించింది.