- వనదేవతల పండగకు సర్వం సిద్దం
- సింగరేణి ఆధ్వర్యంలో ఆర్కేపీ, శ్రీరాంపూర్‌లో జాతరలు
- ఇయ్యాల గద్దెలకు రానున్న సారలమ్మ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలు కొలువుదీరారు. మేడారం వరకు వెళ్లి తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకోలేని వారు అందుబాటులోని మినీ మేడారం జాతరలకు వెళ్లి మొక్కులు అప్పగిస్తుంటారు. రెండేండ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించే తేదీల్లోనే ఇవి కూడా జరుగుతాయి.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున, శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద జాతర నిర్వహిస్తుండగా.. జిల్లాలోని మంచిర్యాలలో గోదావరి నది ఒడ్డున, లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గోదావరి, చెన్నూరు శివారు గోదావరి రోడ్డు, సుబ్బరాంపల్లి, జైపూర్ మండలం వెలిశాల మల్లన్నగుడి, బెల్లంపల్లి మండలం కన్నాల బుగ్గ దేవాలయం, నెన్నెల మండలం గంగారాం, జంగాల్‌పేట గ్రామాల్లో, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల పరిధిలో మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సారలమ్మ తల్లి రాకతో జాతర మహాఘట్టం ప్రారంభం కానుంది.
పూర్తయిన ఏర్పాట్లు
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్ నేతృత్వంలో జాతర కమిటీ చైర్మన్, ఎస్‌ఓటూ జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఆర్కే1ఏ మైన్మేనేజర్జయంత్కుమార్ఆధ్వర్యంలో రామృష్ణాపూర్సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే అటవీ ప్రాంతంలో అధికారులు, ఉద్యోగులు ఏర్పాట్లు చేశారు. శాశ్వతంగా దేవతామూర్తుల గద్దెలు, 24 గంటల పాటు తాగునీరు, పవర్సౌలత్కల్పించారు. వివిధ స్టాల్స్కోసం షెడ్లు, రామకృష్ణాపూర్, మందమర్రి వైపు నుంచి జాతరకు చేరుకోవడానికి రోడ్లు, స్ట్రీట్‌లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమ్మవార్లను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం గద్దెల చుట్టూ బారికేడ్లు కట్టారు. కోల్బెల్ట్ప్రాంతంలో ఎక్కువ మంది భక్తులు ఆర్కేపీలో నిర్వహించే జాతరకు తరలివస్తుంటారు.
దీంతో జాతర ఏర్పాట్లను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సింగరేణి, పోలీస్ శాఖలను ఆదేశించారు. శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు. మంచిర్యాల గోదావరి ఒడ్డున జరిగే జాతరకు భక్తులు భారీగా తరలిరానున్నారు. పవిత్రంగా భావించే గోదావరి నది పక్కనే జాతర జరుగుతుండటంతో భక్తులు ఇక్కడికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మంచిర్యాల బస్టాండ్‌నుంచి జాతర వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. రైల్వే సౌకర్యం ఉండటంతో మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు కూడా తరలి రానున్నారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా..
సింగరేణి కార్మికులు మేడారం మహాజాతరకు వెళ్తుండడంతో ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వేలాది కార్మిక కుటుంబాలు జాతరకు వెళ్తే వారి గైర్హాజరు కారణంగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం 1988 నుంచి మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణ శివారు ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున, 1994 నుంచి శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ నస్పూర్‌లోని ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయం ఆవరణలో సమ్మక్క–సారలమ్మ జాతరను మేడారం తరహాలోనే సంప్రదాయ పద్ధతిలో కోయ పూజారుల నేతృత్వంలో వేడుకలు నిర్వహించడం మొదలు పెట్టారు.