సమ్మక్క బ్యారేజీ.. ప్రారంభానికి రెడీ

సమ్మక్క బ్యారేజీ..  ప్రారంభానికి రెడీ
  •      గోదావరి నదిపై 6.94 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణం
  •     240 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి చేసేలా డిజైన్‌‌
  •     రూ.2,121 కోట్ల ఖర్చుతో గతేడాది పూర్తి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క సాగర్‌‌ (తుపాకులగూడెం)‌‌ బ్యారేజీ ప్రారంభానికి ఎదురుచూస్తోంది. దేవాదుల ఆయకట్టును స్థిరీకరించే ఉద్దేశ్యంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద 6.94 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించారు. 2017 ఫిబ్రవరిలో ప్రారంభమైన పనులు గతేడాదే పూర్తయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ ఈ బ్యారేజీని ప్రారంభిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. 

కానీ, ఎలక్షన్ల కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌‌రెడ్డితో  బ్యారేజీని ప్రారంభింపజేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. రూ.2,121 కోట్లతో నిర్మాణం దేవాదుల లిఫ్ట్‌‌ స్కీమ్‌‌ కెపాసిటీని పెంచడం ద్వారా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని 6.21 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ భావించింది. 

ఇందుకోసం దేవాదుల నుంచి మరిన్ని నీళ్లు ఎత్తిపోసేందుకు వీలుగా గోదావరి నదిపై సమ్మక్క సాగర్‌‌ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. 6.94 టీఎంసీల  సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌‌ డిజైన్ చేసి, రూ.1,624 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. హైదరాబాద్‌‌కు చెందిన ఎస్‌‌ఈడబ్ల్యూ, రిత్విక్‌‌ కంపెనీలు జాయింట్‌‌ వెంచర్‌‌లో పనులు దక్కించుకున్నాయి. 60 పియర్లు, 59 రేడియల్‌‌ గేట్లు, 83 మీటర్ల ఎత్తు, 1,132 మీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించారు. 2020 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా గడువు పొడిగిస్తూ వచ్చారు. 

దీంతో నిర్మాణ వ్యయం రూ.497 కోట్లు పెరగగా, మొత్తం రూ.2,121 కోట్లతో గతేడాది బ్యారేజీ నిర్మాణ పనులు  పూర్తయ్యాయి. 240 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తకి ఛాన్స్‌‌ 240 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి చేసేలా  సమ్మక్క సాగర్‌‌ ప్రాజెక్ట్​ను డిజైన్‌‌ చేశారు. తుపాకులగూడెం గ్రామం వైపు 9 పియర్స్‌‌తో సమ్మక్క హైడ్రో ఎలక్ట్రిక్‌‌ ప్రాజెక్ట్‌‌ నిర్మాణ పనులకు అవసరమైన ప్రైమరీ వర్క్‌‌‌‌ ఇప్పటికే పూర్తి చేశారు. విద్యుత్​ ఉత్పత్తికి సంబంధించిన పనులను జెన్‌‌‌‌కో సంస్థ చేపట్టాల్సి ఉంది. ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉంది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలుకాలేదని ఇంజినీర్లు చెబుతున్నారు. 

ప్రారంభానికి సిద్ధంగా ఉంది

సమ్మక్క సాగర్‌‌ (తుపాకుల గూడెం) బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ వానాకాలంలో వరద వెళ్లడానికి వీలుగా బ్యారేజీకి అమర్చిన 59 గేట్లను పూర్తిగా తెరిచే ఉంచినం. 240 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి పనులను జెన్‌‌కో సంస్థ చేపట్టాల్సి ఉంది. 
– శరత్‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌ శాఖ ఈఈ, ములుగు జిల్లా