
- శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిన యాపలగడ్డ
గుండాల, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర వైభవంగా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణకు చెందిన ఆరెం వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొడవటంచ గ్రామ సమీపంలోని బర్ల గుట్టపై కొలుపుతీరిన పగిడిద్ద రాజును ఆరెం వంశీయులు, గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య తీసుకువచ్చి యాపలగడ్డ గ్రామ సమీపంలో గుండాల, ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన ఉన్న పగిడిద్దరాజు గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం మండల పరిధిలోని పోత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని మడిమోర గుట్ట నుంచి సమ్మక్క వనదేవతను గుడి వద్దకు తెచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పడగలతో ఊరేగించి, గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా మేళతాళాల నడుమ సమ్మక్క పగిడిద్దరాజు, సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమం వైభవంగా జరిపారు. అనంతరం జాతర ప్రారంభమైంది. పరిసరాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. మేడారం జాతర ముగిసిన 16 రోజుల తర్వాత ఇక్కడ నాగవల్లి జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నాలుగు జిల్లాల మధ్య వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ రవీవదర్, ఎస్పై రాజమౌళి గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.జాతర నిర్వాకులు ఆరెం టచ్చుపటేల్, కాంతారావు, ఇద్దయ్య, నాగయ్య, అప్పయ్య
తదితరులు పాల్గొన్నారు.