- ముగ్గులు, అల్లికలతో అలంకరించిన ఆడబిడ్డలు
- మహాజాతర ఘట్టం ప్రారంభమైనట్టేనని ప్రకటన
- వచ్చే బుధవారం మండమెలిగె పండుగ
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు 15 రోజులే ఉన్నందున మేడారంలోని సమ్మక్క గుడి శుద్ది పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు, గ్రామస్తులు, పూజారులు వారి ఇండ్లను శుద్ధి చేశారు. అంతకుముందు అడవిలోకి వెళ్లిన పూజారులు కోరె గడ్డిని తీసుకువచ్చి గుడి పక్కన ఉంచారు. సమ్మక్క పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంట్లో పూజా సామగ్రిని శుభ్రం చేసి మేకపోతును అలంకరించి పూజలు చేశారు. అక్కడినుంచి సమ్మక్క గుడికి వెళ్లి శుద్ధి చేశారు.
సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చే పూజారి కుక్కెర కృష్ణయ్య కోరె గడ్డిని గుడిపై కప్పాడు. ఆడబిడ్డలు గుడిలో ముగ్గులు వేసి అలంకరించి పూజలు చేశారు. దీంతో మహా జాతర ఘట్టం ప్రారంభమైనట్టేనని చెప్పారు. వచ్చే బుధవారం మండెమెలిగె పండుగ ఉంటుందన్నారు. అలాగే కన్నెపల్లిలో కాకవంశీయులు సారలమ్మ ప్రధాన పూజారి సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మ గుడిని శుభ్రం చేశారు. మరోవైపు ముందస్తు మొక్కులు అప్పజెప్పడానికి భక్తులు తరలివచ్చారు. లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరగకుండా అధికారులు అమ్మవారి గద్దెలకు తాళాలు వేశారు.