- గద్దెనెక్కిన సమ్మక్క
- చిలుకలగుట్ట నుంచి మేడారం చేరుకున్న వరాల తల్లి
- వనంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైన అపూర్వఘట్టం
- దారిపొడవునా నీరాజనాలు.. ముగ్గులు, నీళ్లారబోతలు
- రెండు రోజుల్లో 50 లక్షల మంది భక్తుల రాక
- నేడు, రేపు మరో 50 లక్షల మంది వచ్చే చాన్స్
- కొలువుదీరిన తల్లులకు కోటొక్క మొక్కులు
- గద్దెల వద్దకు బారులు క్యూలైన్లను చేరడానికే 3 గంటలు
మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు:
సమ్మక్క తల్లి వచ్చింది. లక్షలాది భక్తుల ఎదురుచూపులకు తెరదించుతూ చిలుకలగుట్ట దిగి, గద్దెపై కొలువుదీరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి కిందికి తీసుకురాగానే అమ్మరాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. అంతే.. అప్పటిదాకా ఊపిరి బిగబట్టిన జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ‘అమ్మ వచ్చె.. సమ్మక్క వచ్చె..’ అంటూ తన్మయత్వంలో భక్తులు శిగమూగారు. చిలుకలగుట్ట దిగువన వేచిచూస్తున్న భక్తులంతా తల్లిని చూసేందుకు, పూజారిని తాకేందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తులను కంట్రోల్ చేసేందుకు రోప్‌పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది.
అక్కడి నుంచి డప్పుచప్పుళ్లు, గజ్జెల హోరు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాలు, దారి పొడువునా ఎదుర్కోళ్ల నడుమ గురువారం రాత్రి సమ్మక్కను మేడారం గద్దెపై ప్రతిష్ఠించారు. నాలుగురోజుల మేడారం మహాజాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో మొక్కులు చెల్లించుకునేందుకు జనవాహిని గద్దెలవైపు కదులుతున్నది. సమ్మక్క రాక నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే భక్తులు మేడారానికి పోటెత్తారు. సాయంత్రానికి 50లక్షల మందికి పైగా భక్తులు మేడారం చేరినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, గుట్ట కింద సమ్మక్కకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ ఘన స్వాగతం పలికారు.
ఉదయం కంకవనం ప్రతిష్ఠాపన
గురువారం ఉదయం కంకవనం తీసుకొచ్చే కార్యక్రమంతో సమ్మక్క తల్లిని మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ మొదలైంది. సమ్మక్క రాకకు ముందు గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అడవి నుంచి కంకవనం (వెదురు కట్టెలు) గద్దె వద్దకు తీసుకువచ్చారు. ఉదయం 5.30 గంటలకు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్ష్మీ దేవరలు సమ్మక్క గుడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుడి నుంచి వడ్డెలు (కుండలు) తీసుకొచ్చి గద్దెపైకి చేర్చారు. వనాన్ని తీసుకొచ్చే పూజారులకు మేడారం గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. సమ్మక్క పూజారులు గ్రామ దేవతలకు బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించి గద్దెల వద్దకు వనం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.
చిలుకల గుట్ట దిగి..
కంకవనం ప్రతిష్ఠాపన అనంతరం సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం గురువారం సాయంత్రం చిలుకలగుట్టపైకి బయల్దేరి వెళ్లింది. ఆ సమయంలో మేడారంలో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో కలిసి మిగతా పూజారులు సిద్ధబోయిన మునేందర్, చంద బాబురావు, సిద్ధబోయిన మహేశ్, సిద్ధబోయిన లక్ష్మణ్ రావు సమ్కక్క తల్లిని గద్దెకు తీసుకురావడానికి చిలుకల గుట్టపైకి వెళ్లి సుమారు 2 గంటల పాటు రహస్యంగా పూజలు చేశారు. అక్కడ పసుపు, కుంకుమ రూపంలో ఉన్న అమ్మవారిని కుంకుమభరిణెలో పెట్టుకొని కొక్కెర కృష్ణయ్య గుట్టపై నుంచి కిందికి దిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్.. సమ్మక్క రాక గుర్తుగా ఏకే 47 గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ శబ్ధాన్ని విన్న భక్తులు ఒక్కసారిగా పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క తల్లిని చిలుకలగుట్ట నుంచి తీసుకువచ్చే దృశ్యం చూడటానికి యువకులు చెట్లపైకి ఎక్కారు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారి కృష్ణయ్యను తాకడానికి వేలాది మంది భక్తులు ప్రయత్నించారు. ఆయనకు రక్షణగా పోలీసులు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీ సాయంతో చాలా వేగంగా నడుచుకుంటూ చిలుకలగుట్ట నుంచి నేరుగా సమ్మక్క దేవాలయానికి సమ్మక్క తల్లిని కొక్కెర కృష్ణయ్య తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేడారంలోని గద్దెపై రాత్రి 9.28 గంటలకు సమ్మక్కను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా 3 నిమిషాల పాటు కరెంట్‌ను ఆఫ్ చేసి పూజలు నిర్వహించారు. కాగా, సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చే క్రమంలో ఆఫీసర్లు గద్దెల దర్శనాన్ని అరగంట పాటు ఆపేశారు. సమ్మక్క ను గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం దర్శనానికి అనుమతించారు. ఆ సమయంలో క్యూలైన్లలో బాగా ఒత్తిడి జరిగి నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్ లలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు..
నేడు గవర్నర్, సీఎం రాక
సమ్మక్క సారలమ్మ మహాజాతరలో పాల్గొనడానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మేడారానికి రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి. రేవంత్ రెడ్డి 2022లో పీసీసీ ప్రెసిడెంట్‌గా మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో వస్తున్నారు.
అడుగడుగునా నీరాజనం
సమ్మక్కను తెచ్చే దారిపొడువునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గద్దెలపైకి వస్తున్న తల్లిపై పసుపు, కుంకుమలతో పాటు ఒడిబియ్యం చల్లుతూ తమను చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. సమ్మక్క వచ్చే దారిని మొత్తం మహిళలు ముగ్గులతో నింపేశారు. నాలుగురోజుల మేడారం మహాజాతరలో మొదటి రోజు(బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకున్నారు. రెండోరోజు (గురువారం) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క కూడా వచ్చి కొలువుదీరింది. దీంతో మిగితా రెండురోజులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. రెండోరోజు గురువారం సాయంత్రం వరకు 50లక్షల మంది భక్తుల వచ్చారని, మిగతా రెండురోజుల్లో మరో 50 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక దిక్కు కొమ్ముబూరల మోతలు, డప్పులచప్పుళ్లు.. మరో దిక్కు శివసత్తుల పూనకాలు, ఎదుర్కోళ్లు..! జనమంతా పబ్బతిపట్టంగ, వనమంతా ముగ్గులు మెరువంగ.. వరాల తల్లి సమ్మక్క చిలుకలగుట్టను వదిలి మేడారం గద్దెమీదికి చేరింది. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకున్నారు. నాలుగురోజుల మేడారం మహాజాతరలో కీలకఘట్టమైన సమ్మక్క రాక గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తోడ్కొనిరాగా.. దారి పొడువునా మహిళలు ముగ్గులు వేసి, నీళ్లారబోసి స్వాగతం పలికారు. అమ్మ మీదికి పసుపు, కుంకుమను చల్లుతూ శిగమూగారు. రాత్రి 9.28 గంటలకు మేడారం గద్దె మీద సమ్మక్క కొలువుదీరింది. వనదేవతలంతా గద్దెల మీదికి చేరుకోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
చిలుకలగుట్ట దిగి, గద్దెనెక్కిన సమ్మక్కకు జనం పబ్బతి పడుతున్నరు. ‘సమ్మక్కా.. సార క్కా..పిల్లపాపలను గొడ్డుగోదను చల్లంగ సూడున్రి ’ అంటూ తల్లుల ముందు సాగిలపడుతున్నరు. తమ ఎత్తు బంగారాలు సమర్పించి, కోళ్లను, మేకలను ఎదురిచ్చి కోసి మొక్కులు చెల్లించుకుంటున్నరు. మహిళా భక్తులు పసు పు, కుంకుమ, గాజులు, చీర, సారె పెట్టి ఒడిబియ్యం పోస్తున్నరు. అమ్మలిద్దరినీ దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా గద్దెల వద్దకు తరలివస్తుండడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు, వలంటీర్లు ముప్పుతిప్పలు పడ్తున్నరు.
ఇసుక వేస్తే రాలనంత జనం..
గురువారం సమ్మక్క గద్దెకు చేరుకునే ఉద్విగ్న ఘట్టాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు మేడారం తరలివచ్చారు. బుధవారం సాయంత్రం వరకు 25 లక్షల మంది భక్తులు రాగా, గురువారం సాయంత్రానికి ఈ సంఖ్య 50లక్షలకు చేరినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గద్దెల నుంచి నలువైపులా ఎటుచూసినా జనమే. వచ్చినవాళ్లు వచ్చినట్లు జంపన్న వాగులో స్నానాలు చేసి దర్శనానికి తరలివెళ్తున్నారు.వాగు నుంచి మేడారం గద్దెల మధ్య దూరం సుమారు 2 కిలోమీటర్లుంటుంది. ఈ మధ్య ఇసుకవేస్తే రాలనంత జనంతో దారులన్నీ కిక్కిరిశాయి. ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా, గ్రామ పంచాయతీ ఎదురుగా రెండు చోట్ల క్యూలైన్ల ఎంట్రన్స్ ఏర్పాటు చేయగా, గురువారం ఉదయం నుంచి నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భక్తులంతా జంపన్నవాగు దగ్గరనుంచి క్యూలైన్ల వరకు రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్నారు. నెత్తిన బంగారంతో ఇరుకు జాగాల్లో అడుగు ముందుకు కదలడానికి గంటలు పడ్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 'చాలా ఏండ్లనుంచి మేడారం జాతరకొస్తున్నం. కానీ ఎన్నడూ ఇంత జనాన్ని సూడలే. ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి దర్శనం క్యూలైన్లు ఉండేవి. భక్తులు ఎక్కువమంది ఉంటే అక్కడ పది, ఇరవై నిమిషాలు ఆగేటోళ్లం. ఇప్పుడేంది సారూ.. జంపన్నవాగు నుంచి గద్దెల దాకా నిండిపోయిన్రు. క్యూలైన్ దగ్గరికి చేరుకునేందుకే మూడు గంటలు పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్లో .. ఎంత దూరంలో ఉన్నరో తెల్వదు ’ అని 60 ఏండ్ల భక్తుడొకరు ఆశ్యర్యపోయాడు.
ప్రైవేట్ వెహికిల్స్‌లోనే ఎక్కువ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు ఎక్కువగా వస్తారని భావించిన అధికారులు మేడారానికి రాష్ట్రవ్యాప్తంగా 6 వేల స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్టీసీ బస్సుల్లో సుమారు నాలుగున్నర లక్షల మంది మేడారం వచ్చారని ఆఫీసర్లు తెలిపారు. ఈ లెక్కన ప్రైవేట్ వాహనాల్లోనే ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా ఎదురుకోళ్లు..
జాతరలో ఎదురుకోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమ్మవారికి ఎత్తు బంగారం, కల్లు, మేకలు, గొర్రెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగా ఎదురు కోళ్లతో అమ్మలకు స్వాగతం పలుకుతారు. చిలకలగుట్ట నుంచి గద్దె మీదకు వచ్చే సమయంలో ఉగ్రరూపంతో ఉండే సమ్మక్క తల్లిని శాంతపరిచేందుకు కోళ్లను గాల్లోకి ఎగరేస్తూ ఎదురు చూపెట్టడం ఆనవాయితీ
49, 373 మందికి వైద్య సేవలు
జాతరకు లక్షల్లో వస్తున్న జనంలో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఇప్పటివరకు 49,373 మందికి వైద్య సిబ్బంది సేవలందించారు. 1100 మందిని ఇన్పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స చేశారు. 92 మందిని పట్టణ హాస్పిటల్స్‌కు రెఫర్ చేశారు.
నా జాతకం ఎట్లున్నదో...
మేడారం(మహాముత్తారం): జాతరలో కోయదొరలు భక్తులకు జాతకాలు చెబుతూ ఉపాధి పొందుతున్నారు. కుర్రో కుర్రు అంటూ భక్తుల వర్తమాన, భవిష్యత్కాలాల గురించి వారిదైన శైలిలో చెప్తూ ఆకట్టుకుంటున్నారు.
డ్యూటీలో ట్రైనీ ఐపీఎస్‌లు
మేడారం(తాడ్వాయి), వెలుగు : జాతరలో ట్రైనీ ఐపీఎస్‌లు డ్యూటీలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలతోపాటు గద్దెల వద్ద తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ట్రైనీ ఐపీఎస్‌లు చిత్తరంజన్, పండారి చేతన్‌నితిన్, రాహుల్ రెడ్డి, శివం ప్రకాష్, చైతన్య రెడ్డి, కాజల్తదితరులు ఇందులో ఉన్నారు.
బ్యాటరీ కారు సేవలు
మేడారం(ఏటూరునాగారం): వృద్ధులు, దివ్యాంగుల కోసం దేవాదాయ శాఖ బ్యాటరీ కారు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాటరీ కారు పని తీరును ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. నడవలేని వారిని గద్దెల వరకు తీసుకువెళ్లి తీసుకువస్తారు.
రెస్క్యూటీం భేష్..
మేడారం(ములుగు):జాతరలో 39మందితో కూడిన సింగరేణి రెస్క్యూ టీం సేవలందిస్తోంది. క్యూలైన్లలో, గద్దెల ప్రాంగణంలో ఎక్కడ అస్వస్థతకు గురైనా వెంటనే స్పందించి సమీపంలోని ప్రధాన వైద్య శిబిరానికి తరలిస్తున్నారు. గురువారం వరకు 120మంది భక్తులను వైద్యసేవలకోసం తరలించారు.