- గతంలోనే ముగిసిన జాతర హుండీల లెక్కింపు
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ముగిసిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. మహాజాతర అనంతరం తిరుగువారం జాతర కూడా ముగిసింది. వీటికి సంబంధించిన హుండీలను అప్పట్లోనే లెక్కించారు. తర్వాత ఎండోమెంట్ అధికారులు 10 హుండీలను ఏర్పాటు చేశారు. గురువారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో ఈవో రాజేంద్రన్, పూజార్ల సమక్షంలో హుండీలను సాయి సేవా సంస్థ వలంటీర్లు లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.22,36, 564 రాగా, సారలమ్మ ఆదాయం రూ.18, 67,016 వచ్చింది. గోవిందరాజు హుండీల్లో రూ. 1,17,761, పగిడిద్దరాజు హుండీలో రూ.91,636 వచ్చింది. మొత్తంగా రూ. 43, 12,977 ఆదాయం వచ్చిందని ఈవో రాజేంద్రన్ తెలిపారు.
రామప్ప హుండీ ఆదాయం రూ.4.87 లక్షలు
వెంకటాపూర్ (రామప్ప) : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప టెంపుల్లో దేవాదాయ శాఖ పరిశీలకుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం హుండీలను లెక్కించారు. మేడారం జాతర, మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.4,87,908 వచ్చిందని ఈవో శ్రీనివాస్ తెలిపారు. వెంకటాపూర్ తహసీల్దార్ సదానందం, రెవెన్యూ సిబ్బంది, ఏఎస్ఐ కృష్ణయ్య పాల్గొన్నారు.