సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు ఫిబ్రవరి 24( శనివారం) వన ప్రవేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి గద్దె ల శుద్ది ప్రక్రియ మొదలై 5 నుంచి 6 గంటల మధ్య జరుగుతుంది.... ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వన ప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి.
ఎటుచూసినా జనమే
మూడురోజుల్లో కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారని దేవాదాయశాఖ అధికారులు ప్రకటించారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చిన బుధవారం 20 లక్షల మంది దాకా, సమ్మక్కను తీసుకొచ్చిన గురువారం 30 లక్షల మందికిపైగా, శుక్రవారం 50 లక్ష మందికి పైగా మేడారం వచ్చారని వెల్లడించారు. గురువారం నుంచి మేడారం చుట్టూ రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్, కన్నెపల్లి ఏరియాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.
బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మేడారం గద్దెలు నిమిషం కూడా ఖాళీలేకుండా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. ఇలా మూడు రోజుల్లో కలిపి సుమారు కోటి మందికి పైగా మేడారానికి వచ్చారని అధికారులు ప్రకటించారు. మహాజాతరకు శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.