వనం నుంచి జనంలోకి.. గద్దెలపై కొలువుదీరిన సారక్క

  •     గద్దెలపై కొలువుదీరిన సారక్క
  •     అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
  •     సింగరేణి ప్రాంతాల్లో సందడి
  •     పూజల్లో సింగరేణి జీఎంలు, మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతాలైన మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1ఏ గని సమీప​పాలవాగు ఒడ్డున, శ్రీరాంపూర్​ఏరియా ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం వైభవంగా మొదలైంది. సారలమ్మ తల్లిని కోయ పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో జాతర క్రతువులో మొదటి ఘట్టం అవిష్కృతమైంది. ఉదయం నుంచి భక్తులు వేలాదిగా జాతరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 

గిరిజన సంప్రదాయ పద్ధతిలో గద్దెపైకి..

రామకృష్ణాపూర్​లోని పాలవాగు ఒడ్డున నిర్వహిస్తున్న జాతరలో భాగంగా సాయంత్రం పొద్దుపోయాక భక్తజన సందోహం మధ్య సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. ముందు మందమర్రిలోని దూలం కనకయ్యగౌడ్​ఇంటి వద్ద పూజలు చేసి సారలమ్మను ఆర్కే1ఏ గని వరకు తీసుకొచ్చారు. అనంతరం గని సమీపంలోని పోచమ్మ తల్లి ఆలయంలో పూజల అనంతరం సారలమ్మను డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాల మధ్య కోయ పూజరులు జాతర ప్రాంగణానికి తీసుకొచ్చారు. వెంట మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్-–సవిత ​దంపతులు, జాతర చైర్మన్, సింగరేణి ఎస్​ఓటుజీఎం రాజశేఖర్ ​రెడ్డి, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ​ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, క్యాతనపల్లి మున్సిపల్​ చైర్మన్​ జంగం కళ, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల లీడర్లు తదితరులు వచ్చారు. సంప్రదాయపద్దతిలో పూజలు చేసిన సారలమ్మను గద్దెపై ప్రతి ష్ఠించి భక్తుల దర్శనానికి  అనుమతించారు. 

శ్రీరాంపూర్​ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద

శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నస్పూర్ సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయ ఆవరణలో జాతర జోరుగా మొదలైంది. కోయ పూజారులు, శ్రీరాంపూర్​ ఏరియా జీఎం సంజీవరెడ్డి–-రాధాకుమారి దంపతులు, ఎస్​ఓటుజీఎం కె.రఘుకుమార్,  సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్​ వెంకటేశ్వర్ ​రెడ్డి, ఏజీఎం మురళీధర్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, నస్పూర్​ మున్సిపల్ ​చైర్మన్​ సురిమిల్ల వేణు తదితరులు సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకవచ్చి ప్రతిష్ఠించారు. తర్వాత భక్తులు సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

గద్దెపై కొలువుదీరిన సారలమ్మ

తిర్యాణి :  తిర్యాణి మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ అరటిపల్లి అటవీ ప్రాంతంలో సమ్మక్క–సారలమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం అడవీ ప్రాంతం నుంచి సారలమ్మను గద్దెలకు తీసుకువచ్చారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు.