- సమోవా బ్యాటర్ విస్సెర్ కొత్త వరల్డ్ రికార్డు
- యువరాజ్ 36 రన్స్ రికార్డు బ్రేక్
- 10 రన్స్ తేడాతో వనాటుపై సమోవా గెలుపు
సమోవా మిడిలార్డర్ బ్యాటర్ డేరియస్ విస్సెర్ (65 బాల్స్‌లో 5 ఫోర్లు, 14 సిక్స్‌లతో 132) టీ20ల్లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 39 రన్స్ కొట్టి అరుదైన ఘనత సాధించాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ రీజియన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమోవా 10 రన్స్ తేడాతో వనాటుపై గెలిచింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సమోవా విస్సెర్ సంచలన ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 174 రన్స్‌కు ఆలౌటైంది. జస్మత్ (16) ఫర్వాలేదనిపించాడు. వనాటు బౌలర్ నిలిన్ నిపికో వేసిన 15వ ఓవర్‌లో విస్సెర్ ఆరు సిక్సర్లు బాదాడు. ఇందులో మూడు నో బాల్స్‌తో కలిపి (6 6, 6, నో బాల్, 6, 0, నో బాల్, 7 నో బాల్స్, 6) మొత్తంగా 39 రన్స్ దంచాడు. ఫలితంగా గతంలో యువరాజ్ సింగ్ (2007), కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దీపేంద్ర సింగ్ (2024) నెలకొల్పిన 36 రన్స్ రికార్డు బ్రేక్ అయ్యింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ కలిపి 36 రన్స్ దంచారు.
ఒకే ఓవర్‌లో అత్యధిక రన్స్ (36) ఇచ్చిన స్టువర్ట్ బ్రాడ్ (2007), అఖిల ధనంజయ (2021), కరీమ్ జనత్ (2024), కమ్రాన్ ఖాన్ (2024), అజ్ముతుల్లా ఒమర్‌జాయ్ (2024) చెత్త రికార్డును నిపికో అధిగమించాడు. ఇక టీ20ల్లో సమోవా తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గానూ విస్సెర్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీలో గ్రేడ్ క్రికెట్ ఆడే విస్సెర్ నిఖార్సైన పవర్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆడిన మూడో టీ20లోనే సెంచరీ సాధించి వరల్డ్ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత ఛేజింగ్‌లో వనాటు 20 ఓవర్లలో164/9 స్కోరుకే పరిమితమైంది. నలిన్ నిపికో (73) టాప్ స్కోరర్. జోషువా రాసు (23), టిమ్ కట్లెర్ (21), ఆండ్రూ మన్సాలె (22) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. విస్సెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో సమోవా.. ఫిజితో తలపడుతుంది.
డేరియస్ విస్సెర్
బాల్స్: 65
ఫోర్లు: 5
సిక్స్‌లు: 14
రన్స్: 132