హిమాచల్​ రాజకీయాల్లో 'సమోసా' రగడ

హిమాచల్​ రాజకీయాల్లో 'సమోసా' రగడ
  • సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరో తిన్నరని సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించినట్లు ఆరోపణలు    
  • బీజేపీ నేతలవి చిల్లర వ్యాఖ్యలని కాంగ్రెస్ ఫైర్​

హమీర్‌‌‌‌పూర్/సిమ్లా: హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ రాజకీయాల్లో సమోసా ఓ పెద్ద రగడైంది. కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలు సమోసా చుట్టూ నడుస్తున్నాయి. గత నెలలో ఒక రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్​ సింగ్ సుఖు కోసం అధికారులు ప్రత్యేకంగా సమోసాలు తీసుకొచ్చారు. అయితే, వాటిని సీఎంకు వడ్డించకుండా మధ్యలో వాటిని సెక్యూరిటీ సిబ్బందికి వాటిని పంపిణీ చేశారు. దీనిపై ప్రభుత్వం సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించిందని హమీర్​పూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్​శర్మ ‘ఎక్స్‌‌’లో ఆరోపించారు.

ఈ మేరకు ఆశిష్​శర్మ సీఎం కోసం 11 సమోసాలను ఆన్​లైన్​లో ఆర్డర్ చేశారు. ప్రజా సమస్యల్ని వదిలి ఇలా చేయడాన్ని నిరసిస్తూ సీఎంకు తాను ఆన్​లైన్​లో సమోసాలు ఆర్డర్ చేశానని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలవి చిల్లర పనులు, చిల్లర వ్యాఖ్యలని ఫైర్ అయింది. సీఎంను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికే ఇలాంటివి చేస్తున్నారని విమర్శించింది. ఈ విషయంపై తాము ఎలాంటి విచారణకు ఆదేశించలేదని స్పష్టం చేసింది. అలాగే, సమోసాల ఘటనపై తాము కూడా ఎలాంటి ఎంక్వైరీ చేపట్టలేదని ఆ రాష్ట్ర సీఐడీ డీజీ రంజన్​ ఓజా కూడా ప్రకటించారు.

బాధ్యుల నుంచి వివరణ కోరాం..

గత నెల 21న సీఎం సుఖు సిమ్లాలోని సీఐడీ హెడ్ ఆఫీసులో సైబర్ సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించారు. లంచ్ అక్కడే చేశారు. రివ్యూలో పాల్గొన్న సీఎం, ఉన్నతాధికారులకు లంచ్​లో వడ్డించేందుకు తెచ్చిన సమోసాలు, కేక్‌‌‌‌లను ఆఫీసు వెలుపల ఉన్న ఆయన సెక్యూరిటీ సిబ్బందికి పంపిణీ చేశారు. దీనిపై ప్రభుత్వం సీఐడీ ఎక్వైరీకి ఆదేశించిందని.. మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే దీనిపై తాము ఎంక్వైరీ చేపట్టలేదని, సీఎం నుంచి కూడా ఎలాంటి ఆర్డర్లు రాలేదని రంజన్ ఓజా చెప్పారు. ఈ పొరపాటుకు బాధ్యులైన వారి నుంచి వివరణ మాత్రం కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. కాగా, శనివారం సిమ్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యకర్తలకు సమోసాలను ఆ పార్టీ నేతలు పంపిణీ చేశారు.