అయిజ/ శాంతినగర్, వెలుగు : అలంపూర్ ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు ఎప్పుడిస్తరని సీఎం కేసీఆర్ ను అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాగర్జన సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ 24 గంటలు కరెంటు ఇస్తామని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పి 9 ఏండ్లు గడుస్తున్నా నేటికీ ఆ దిశగా ప్రయత్నించలేదన్నారు.
గత ఎన్నికల సమయంలో హడావుడిగా తుమ్మల లిఫ్ట్ ను ప్రారంభించి, దాని పరిధిలో నిర్మించాల్సిన జూలకల్లు, వల్లూరు, మల్లమ్మ కుంట రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడి నేతలు బీఫామ్ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక రాష్ట్రంతో చర్చించి ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్నారు.
బీఆర్ఎస్ లో బీఫామ్ పంచాయితీ నేటికీ తెగలేదన్నారు. ధరణి బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారిందని ఆరోపించారు. అలంపూర్ లో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి, తనకు మరొకసారి ఎమ్మెల్యే గా అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేతలు శెక్షావల్లి ఆచారి, నాగేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మద్దిలేటి, మధు కుమార్, బస్వరాజు, మహిళా నేతలు నాగ శివమణి, సులోచన, సుజాత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.