అయిజ,వెలుగు: తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబం ఆధిపత్యం, ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను కాఫీ కొట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి, ప్రాజెక్టుల నిర్మాణంలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నాసిరకం నిర్మాణాలతో ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయని తెలిపారు. ఇలాంటి నేతలకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అగ్రవర్ణాల చెప్పుచేతల్లో మెలిగే అభ్యర్థికి టికెట్ కేటాయించి, నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ALSO READ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: బేరారామ్
అనంతరం మండలంలోని కొత్తపల్లి, తూముకుంట, మేడికొండ, తాండ్రపాడు, వేణి సోంపురం గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శెక్షావలి ఆచారి, యూత్ కాంగ్రెస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, నేతలు మద్దిలేటి, జయన్న, బస్వరాజు, మధు కుమార్, దేవేందర్ పాల్గొన్నారు.