మంత్రగాళ్ళ భయం ఇంకెంత కాలం?

మంత్రగాళ్ళ భయం ఇంకెంత కాలం?

మూఢనమ్మకాలు మనల్ని అంద పాతాళానికి నెట్టుతున్నాయి.మంత్ర గాళ్ళ పేరుతో జరుగుతున్న ఉన్మాదమే దీనికి నిదర్శనం.ఈ విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంత్రగత్తెల పేరిట మహిళలపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి మచ్చ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మంత్రగత్తెల నెపంతో ఇద్దరు మహిళలపై  ఓ వ్యక్తి దాడి చేసిన కేసులో బిహార్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేను అత్యున్నతధర్మాసనం కొట్టివేసింది. మహిళల ప్రాథమిక హక్కులు, గౌరవానికి దాడులతో భంగం వాటిల్లుతోందని,వృద్ధ, వితంతు మహిళలపై దాడులు చేసేందుకు నెపాన్ని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి సంఘటనలు  కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు,  దేశంలో పలు ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి.

మాయలు, మంత్రాలు పేరుతో వేల కోట్ల రూపాయలు దందా జరుగుతోంది. ప్రజల మానసిక బలహీనతను ఆసరాగా చేసుకొని మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, బాబాలు, స్వాములు ప్రజలను మోసం చేస్తున్నారు. బాణామతి, చేతబడి పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే.. అంధత్వంలోకి జారుకుంటున్నాడు. ఇప్పటికే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మంత్రగాళ్లు, బాబాలను ఆశ్రయించడం దురదృష్టకరమని బాంబే హైకోర్టు కూడా అభిప్రాయపడింది. మేధో వైకల్యం ఉన్న ఆరుగురు బాలికలపై ఓ మంత్రగాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీన్ని ఖరారు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంధ విశ్వాసాలు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతోంది. తల్లి కడుపులో నుంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూసి కనే రోజులొచ్చాయి. మనిషి మరణానికి సైతం ఘడియలు చూస్తున్నారు. క్షుద్ర పూజల వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రజల్లో వైజ్ఞానిక చైతన్యం లేకపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణం.

ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మెజార్టీ గ్రామాల ప్రజలు వేములవాడ ప్రాంతానికి చెందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరు మీద లింగ ధారణ చేసుకొని దేవునికి అంకితం కావడం జరుగుతోంది. ఈ ఆచారం ముఖ్యంగా దళిత, గిరిజనుల్లో కొనసాగుతోంది. ఈ ధారణ ఉన్న వ్యక్తులు అంత్యక్రియలు కూడా వేరే విధంగా ఉంటాయి. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ జీవన విధానాన్ని అవలంబించకపోవడం దురదృష్టకరం.

శాస్త్రీయ విధానాలను ప్రోత్సహించాలి
ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకునే వారి సంఖ్య పెరిగింది. మనదేశంలో  గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు. సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్ కు ఆదరణ పెరిగిపోతుంది. ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సైతం అశాస్త్రీయ ప్రచారం జరుగుతుంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రమే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచనా విధానాలను ప్రోత్సహించాలి. నిత్యసమస్యలను ఎదుర్కోవడానికి గల శాస్త్రీయ పరిష్కారాలను ప్రజలకు తెలియచేయాలి. అంతేకాకుండా సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో వేళ్లూనికొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు.

మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. ఇవీ నవ కల్పనలకు నాంది పలకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దీనికై శాస్త్ర, సాంకేతిక రంగాలకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలి. సైన్సు సత్యాలు విశ్వవ్యాపితం. అవి జాతీయ సరిహద్దులకు పరిమితం కావు. మతాల అడ్డుగోడల మధ్య బందీలు కావు. కుల విభజనలకు లొంగవు. వర్గ వైషమ్యాలతో సాగవు. కావున  శాస్త్రీయ పురోగతి వైపు ప్రతి ఒక్కరం అడుగేద్దాం. మూఢనమ్మకాలకు ముగింపు పలుకుదాం.

మితిమీరిన అంధవిశ్వాసాలు
గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనా,  చిన్న పిల్లలు ఏడ్చినా, వాంతులు-, విరేచనాలు అయినా   బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను  పాస్టర్లను ఆశ్రయించడం జరుగుతుంది.  వీటివల్ల వారి ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సాంత్వన జరగకుండా చివరికి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం. ఇవి మితిమీరి కొనసాగడం వల్ల గ్రామాల్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఈ రకమైన అంధవిశ్వాసాలతో శాంతిభద్రతల సమస్య నెలకొంది.

మంత్రాల నెపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహినత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల్లో శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించేతత్వం లోపించడమే దీనికి ప్రధాన కారణం. మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు , ప్రభుత్వవిధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి.

-సంపతి రమేష్ మహారాజ్, సామాజిక విశ్లేషకులు