- తొలి టీ20లో 61 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై ఇండియా గ్రాండ్ విక్టరీ
- రాణించిన చక్రవర్తి, బిష్ణోయ్
డర్బన్ : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి తమ కప్పు కల సాకారం చేసుకున్న టీమిండియా ఆ జట్టుపై మరోసారి పైచేయి సాధించింది. సంజూ శాంసన్ (50 బాల్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) కెరీర్‌లో వరుసగా రెండో సెంచరీకి తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/25), రవి బిష్ణోయ్ (3/28) సత్తా చాటడంతో తొలి టీ20లో ఇండియా 61 రన్స్ తేడాతో సఫారీలపై గెలిచింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 202/8 స్కోరు చేసింది.
తిలక్ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) రాణించాడు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఓవర్లలో 17.5 ఓవర్లలో 141 స్కోరుకే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (25), కొయెట్జీ (23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.
శాంసన్ ఫటాఫట్
గత నెల ఉప్పల్ స్టేడియంలో తన చివరి టీ20లో బంగ్లాదేశ్‌పై సెంచరీతో దంచిన సంజూ శాంసన్ అదే ఫామ్‌ను కొనసాగించాడు. మరోసారి ఓపెనర్‌గా వచ్చిన అతను ఉన్నంతసేపు సఫారీ బౌలింగ్‌ను ఉతికేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (7) ఫెయిలైనా కెప్టెన్ సూర్యకుమార్ (21) తోడుగా శాంసన్ రెచ్చిపోయాడు. వచ్చిరాగానే సూర్య 4, 6తో మెరవగా.. యాన్సెన్ వేసిన ఐదో ఓవర్లో శాంసన్ 4, 6తో జోరు పెంచాడు. వీళ్ల దెబ్బకు పపర్‌ప్లేలోనే స్కోరు ఫిఫ్టీ దాటింది. పీటర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన సంజూ 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో ఓవర్లో సూర్యను ఔట్ చేసిన క్రుగెర్ రెండో వికెట్‌కు 66 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు.
అయితే, తిలక్ వర్మ రాకతో ఇన్నింగ్స్‌కు మరింత జోష్ వచ్చింది. కేశవ్ బౌలింగ్‌లో 6, 4 కొట్టిన శాంసన్.. అరంగేట్రం బౌలర్ సిమెలానె వేసిన 13వ ఓవర్లో 4,4,6తో 90ల్లోకి వచ్చాడు. క్రుగెర్ బౌలింగ్‌లో తిలక్ 4,6 కొట్టగా.. శాంసన్ భారీ సిక్స్ బాదాడు. మహారాజ్ వేసిన తర్వాతి ఓవర్లో సింగిల్‌తో 47 బాల్స్‌లోనే సంజూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోరు చూస్తుంటే ఇండియా ఈజీగా 250 రన్స్ చేసేలా కనిపించింది. కానీ, అదే ఓవర్లో భారీ షాట్‌కు ట్రై చేసిన తిలక్ యాన్సెన్‌కు చిక్కడంతో మూడో వికెట్‌కు 77 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. పీటర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన శాంసన్ తర్వాతి బాల్‌కే స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దాంతో ఇండియా ఇన్నింగ్స్ డీలా పడింది. స్లాగ్ ఓవర్లలో సఫారీ బౌలర్లు స్కోరు కట్టడి చేస్తూ వరుస వికెట్ల పడగొట్టారు. హార్దిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11), అక్షర్(7) ఫెయిలవగా.. అర్ష్‌దీప్ (5 నాటౌట్) స్కోరు 200 దాటించాడు. చివరి ఆరు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన ఇండియా 40 రన్స్ మాత్రమే చేసింది.
తిప్పేసిన వరుణ్, బిష్ణోయ్
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో సౌతాఫ్రికాను ఆరంభంలో పేసర్లు దెబ్బకొడితే.. మధ్యలో స్పిన్నర్లు చక్రవర్తి, బిష్ణోయ్ ఆ జట్టు నడ్డి విరిచారు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే కీపర్ క్యాచ్‌తో కెప్టెన్ మార్‌క్రమ్ (8)ను అర్ష్‌దీప్ ఔట్ చేయగా.. నాలుగో ఓవర్లో స్టబ్స్ (11)ను అవేశ్ పెవిలియన్ చేర్చాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన చక్రవర్తి దూకుడుగా ఆడుతున్న రికెల్టన్ (21) పని పట్టడంతో ఆతిథ్య జట్టు 49/3తో పవర్ ప్లే ముగించింది.
ఈ దశలో హిట్టర్లు క్లాసెన్, మిల్లర్ (18) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. కానీ, 12వ ఓవర్లో ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చిన చక్రవర్తి సఫారీలకు డబుల్ షాకిచ్చాడు. తర్వాతి ఓవర్లోనే బిష్ణోయ్ బౌలింగ్‌లో క్రుగెర్ (1), సిమెలానె (6) కూడా ఔటవ్వడంతో ఇండియా విజయం ఖాయమైంది. కాసేపు పోరాడిన కొయెట్జీ రనౌటవ్వగా.. కేశవ్ (5)ను బౌల్డ్ చేసిన అవేశ్ మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లలో 202/8 (శాంసన్ 107, తిలక్ 33, కొయెట్జీ 3/37);
సౌతాఫ్రికా : 17.5 ఓవర్లలో 141 ఆలౌట్ ( క్లాసెన్ 25, కొయెట్జీ 23, చక్రవర్తి 3/25, బిష్ణోయ్ 3/28)