IND vs ZIM 2024: శాంసన్ ఒంటరి పోరాటం.. జింబాబ్వే ముందు సాధారణ లక్ష్యం

జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఓ మోస్తరు స్కోర్ కే పరిమితమైంది. వికెట్ కీపర్ సంజు శాంసన్ (45 బంతుల్లో 58: ఫోర్, 4 సిక్సులు) సూపర్ హాఫ్ సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పరాగ్(22), దూబే (26) పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి బంతికే ఏకంగా 13 పరుగులు వచ్చాయి. దీంతో  మరోసారి భారీ స్కోర్ కొట్టడం ఖాయమనుకున్నారు. అయితే తొలి ఓవర్ నాలుగో బంతికే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా ఒక అద్భుతమైన బంతితో జైశ్వాల్ (12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

గిల్, అభిషేక్ శర్మ ఉన్న కాసేపు బ్యాట్ ఝళిపించడంలో విఫలమయ్యారు. ఇద్దరూ కుదురుకున్నట్టు కనిపించినా తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. అభిషేక్ శర్మ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. శుభమాన్ గిల్ 13 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. దీంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత్ ను సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 65 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. జట్టు స్కోర్ 105 పరుగుల వద్ద 22 పరుగులు చేసి పరాగ్ ఔటయ్యాడు. 

సంజు శాంసన్ కు జత కలిసిన దూబే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న శాంసన్ వ్యక్తిగత స్కోర్ 58 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. చివర్లో రింక్ సింగ్ (11), దూబే (26) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 160 పరుగుల మార్క్ చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో ముజురుభాని రెండు వికెట్లు అంగారవ, సికిందర్ రాజా, మవుట తలో వికెట్ తీసుకున్నారు.