శాంసన్‌కు యాటిట్యూడ్ ఎక్కువ.. ఎవరి మాట వినడు: భారత మాజీ బౌలర్

శాంసన్‌కు యాటిట్యూడ్ ఎక్కువ.. ఎవరి మాట వినడు: భారత మాజీ బౌలర్

టాలెంట్ ఉన్నా జ‌ట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఆటగాళ్లలో సంజూ శాంస‌న్ ఒక‌డు. వరల్డ్ కప్ 2023లో చోటు సంపాదించలేకపోయిన ఈ యువ కీపర్.. ఇండియా- ఆస్ట్రేలియా వన్డే సిరీస్, ఆసియన్ గేమ్స్ జట్లకు కూడా ఎంపిక కాలేకపోయాడు. ఇది ఒకరకంగా భారత క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. అతన్ని కావాలనే పక్కనపెడుతున్నారంటూ సెలక్టర్లను విమర్శించని నోరు లేదు. మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అందరూ అతని వైపే. 

శాంసన్‌ టాలెంట్ ఉన్నా ఆటగాడైనా.. పరిస్థితికి తగ్గట్టుగా ఆడకపోవటం అతన్ని  ఎంపిక చేయకపోవటానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతనికి అవకాశాలు ఇవ్వలేదన్నది వాస్తవం కాదు. వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేదు. ఇదే విషయాన్నీ భారత మాజీ పేసర్ శ్రీ‌శాంత్ చెప్పుకొచ్చాడు. పిచ్‌ను అర్థం చేసుకొని, అందుకు త‌గ్గ‌ట్టు ఆడాల‌ని ఎన్నిసార్లు చెప్పినా అతను విన‌లేద‌ని శ్రీ‌శాంత్ వెల్లడించాడు.

"నేను శాంస‌న్‌ను క‌లిసిన ప్ర‌తిసారి ఒక‌టే చెప్పేవాడిని. సంజూ పిచ్‌ను అర్థం చేసుకొని.. ప‌రిస్థితుల‌కు తగ్గట్టుగా ఆడు అని చెప్పేవాడిని. కానీ, అత‌ను నా మాట ఎప్పుడూ విన‌లేదు. ఒక‌వేళ నా మాటల్లోని నిజాలను అర్థం చేసుకొని.. అలా చేసి ఉంటే అత‌డి కెరీర్ మ‌రోలా ఉండేది.." అని శ్రీ‌శాంత్ తెలిపాడు. అంతేకాదు ఒకానొక సమయంలో శాంస‌న్‌ను కేర‌ళ జ‌ట్టులోకి తీసుకోవాలనుకున్నాన‌ని, అప్పుడు అంద‌రూ త‌న‌ను అతను ఎందుకని ప్ర‌శ్నించార‌ని పాతరోజులు తెలిపాడు.

కాగా, 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్  జట్టులో స‌భ్యుడైన శ్రీ‌శాంత్, ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్ప‌డి కెరీర్‌ను చేజేతులా నాశ‌నం చేసుకున్నాడు.