దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్‌సంగ్ కంపెనీ ఛైర్మన్ లీ కున్-హీ (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 2014లో గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆయన గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. కొరియాలోని డేగులో 1942 జనవరి 9న లీ జన్మించారు. శామ్‌సంగ్ వ్యవస్థాపకుడు, లీ కున్ తండ్రి అయిన లీ బైంగ్-చుల్ మరణం తర్వాత 1987లో లీ కున్ శామ్‌సంగ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో శాంసంగ్ కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థగా మార్చారు. లీ అనారోగ్యం కారణంగా.. ఆయన కుమారుడు, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ లీ జే-యోంగ్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నాడు. లీ మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు.
For More News..