లెగోస్లా గోడకు తగ్గట్టు
డిజైన్ చేసుకునే టీవీ
146 అంగుళాల నుంచి
292 అంగుళాల సైజు
రేటు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్లు
దాని పేరు ‘వాల్’. గోడలాగే ఉంటుంది. కానీ, గోడ కాదు. వాల్‌పేపర్‌లా కనిపిస్తుదంది. కానీ, అదీ కాదు. శాంసంగ్ తయారు చేసిన టీవీ. అంటే గోడను అంటిపెట్టుకుని ఉండే టీవీ. దీంట్లో ఏముంది అంత స్పెషల్ అంటారా? దీన్ని గోడకు పెట్టేస్తే గోడలో కలిసిపోతుంది మరి. మామూలుగా ఓ టీవీని గోడకు పెట్టేసుకుంటాం.. కానీ, దీనిని గోడకు తగ్గట్టు మార్చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకునే లెగోస్ తెలుసు కదా. ఒక దాని మీద ఒకటి పద్ధతిగా పేర్చుకుంటూ పోయేవి. ఆ లెగోస్ బ్రిక్స్ లాగానే ఈ టీవీని కావాల్సిన షేప్‌లో డిజైన్ చేసుకోవచ్చు. గోడకు తగ్గట్టు పెట్టుకోవచ్చు. దాని కోసమే శాంసంగ్ మైక్రోఎల్ఈడీ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఆ మైక్రోఎల్ఈడీలను పద్ధతి ప్రకారం, మనకు కావాల్సిన రూపంలో పెట్టేసి టీవీలా మార్చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీవీల్లో రెండు రకాలను కంపెనీ అందిస్తోంది ఒకటి ద వాల్ ప్రో.
రెండోది ద వాల్ లగ్జరీ. వీటిని ఇంటి వరండా, కాన్ఫరెన్స్ హాలుకు తగ్గట్టు పెట్టుకోవడానికి వీలుంటుంది. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్‌ను 2 వేల నిట్ల వరకు సెట్ చేసుకోవచ్చట. అంతేకాదు, లక్ష గంటల (జీవితకాలం) పాటు టీవీ పనిచేస్తుందట. అల్ట్రా క్రోమా టెక్నాలజీ ప్రకారం 16 బిట్, 20 బిట్ కలర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ టీవీల్లో పెట్టారట. దీని వల్ల టీవీల్లో ట్రూ కలర్స్ కనిపిస్తాయట. వేరియంట్లకు తగ్గట్టు 4కే, 8కే స్క్రీన్లుగా వీటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల సైజుల్లో టీవీలను డిజైన్ చేశారు. బొమ్మ క్లారిటీ బాగా ఉండేందుకు బ్లాక్ సీల్ టెక్నాలజీని టీవీలో వాడారు. ఆ టెక్నాలజీతో కనీసం దుమ్ము, ధూళి కూడా టీవీపై పడదట. టీవీని ఆపేయాల్సిన అవసరమూ లేదట. ఆన్‌లో ఉంచేసి గోడకు కేన్వాస్లాగా (వాల్పేపర్లు) కూడా దీనిని మార్చుకునే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. మరి, అన్ని ఫీచర్లుంటే రేటు కూడా అదే రేంజ్లో ఉంటుంది కదా. అవును మరి, ఈ టీవీ రేటు సైజును బట్టి రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంది. అక్టోబర్‌లోనే దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి.