ఓవైపు దర్శకుడిగా మెప్పిస్తూనే మరోవైపు నటుడిగానూ ఆకట్టుకుంటున్నారు సముద్రఖని. మూడేళ్లుగా తెలుగులో మరింత బిజీ అయిన ఆయన, నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల
నియోజకవర్గం’లో విలన్‌గా నటించారు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా సముద్రఖని చెప్పిన సంగతులు.
‘‘అల వైకుంఠపురములో, క్రాక్, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట లాంటి వరుస సినిమాల తర్వాత అలాంటి మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం రాజశేఖర్ ఈ కథ చెప్పగానే వెంటనే కనెక్టయ్యాను. ఎందుకంటే ఆ సంఘటనలన్నీ తమిళనాడులో రియల్‌గా జరిగాయి. ఉదయ్ చంద్రన్ అనే కలెక్టర్, మరో ఎంపీ కలిసి పాతికేళ్లుగా ఎన్నికలు జరగని రెండు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి అక్కడ ఎన్నికలు జరిపారు. ఇలాంటిదే బీహార్‌లో కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏదో చోట ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే ఇంటరెస్టింగ్‌గా అనిపించింది.
నేను రాజప్ప అనే పాత్రలో నటించా. క్లైమాక్స్ వరకు ఒకే ఎమోషన్‌తో సాగే క్యారెక్టర్. నటనకి స్కోప్ ఉంది. డ్యూయల్ రోల్ చేయడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. చేసేటప్పుడు కొంత కష్టంగా ఫీలయినా, స్క్రీన్‌పై చూడగానే ఆ కష్టమంతా మర్చిపోయా. నితిన్ గారితో నటించడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. రియల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. లవ్, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న ఎంటర్‌టైనర్. కచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. గాడ్ ఫాదర్, దసరా చిత్రాల్లో కూడా నటిస్తున్నా. నటుడిగా నేనెంత బిజీగా ఉన్నప్పటికీ రైటింగ్ అంటే నాకు ప్రాణం. షూటింగ్ గ్యాప్‌లో, జర్నీ టైమ్‌లో స్క్రిప్ట్స్ రాసుకుంటాను. మంచి స్టోరీ లైన్స్ ఉన్నాయి. జీ5 కోసం ఒక చిన్న సినిమా చేస్తున్నా. ప్యాన్ ఇండియా లాంటివి నేనంతగా పట్టించుకోను. మంచి స్క్రిప్ట్ ఉంటే చాలు, అదే మనల్ని అన్ని చోట్లకీ తీసుకెళ్తుందని నమ్ముతాను.’’