- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
- కౌలు రైతుల గుర్తింపు కోసం డిసెంబర్ 4న ధర్నా
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులకు తక్షణమే న్యాయం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కౌలు రైతులతో కలిసి డిసెంబర్ 4న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజాదర్బారు, ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ తరపున టి.సాగర్ (రైతు సంఘం), విస్సా కిరణ్, బి.కొండల్(రైతు స్వరాజ్య వేదిక), ప్రభులింగం (రాష్ట్ర కౌలు రైతుల సంఘం), వి.ప్రభాకర్ (ఏఐపీకేఎస్), ఆర్.వెంకటరాములు (వ్యవసాయ కార్మిక సంఘం), జక్కుల వెంకటయ్య (రైతాంగ సమితి) మాట్లాడారు.
కౌలు రైతులను గుర్తించి, వారికి పథకాలన్నీ అందిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, వెంటనే ఆ హామీని అమలుచేసి కౌలు రైతులకు తక్షణం న్యాయం చేయాలన్నారు. రైతు పండుగలో కౌలు రైతులకు భాగం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులను గుర్తించినప్పుడే నిజమైన రైతు పండుగ అని పేర్కొన్నారు. ‘‘రైతు ఆత్మహత్యలలో 75 శాతం కౌలు రైతులవే. కౌలు రైతులను గుర్తించి వారికి పూర్తి మద్దతు అందిస్తేనే, రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధిస్తాం. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, పంట కొనుగోలు కౌలు రైతులందరికీ వర్తింపజేయాలి”
అని నాయకులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలను ఈ సందర్భంగా వారు మీడియాకు విడుదల చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేస్తుందన్న భరోసా ఉందన్నారు. డిసెంబర్ 4 కార్యక్రమం వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.