హుజూర్ నగర్ , వెలుగు : ప్యాకేజీ లీడర్లు, పేకాట క్లబ్బులు , సారా బెల్లం డీలర్లు పార్టీకి అవసరం లేదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనతో ఉన్న లీడర్లను అక్రమాలు చేయకుండా అడ్డుకున్నందుకే పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. కమీషన్లు , పర్సంటేజీలు కోరేవాళ్లతో తనకు పనిలేదని నిస్వార్థంగాప్రజా సంక్షేమాన్ని కోరే వారు తన వెంట ఉన్నారని చెప్పారు.
నాలుగు ఏళ్లుగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ రూ.1000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. బంజారా భవన్, పాలిటెక్నిక్ కాలేజీ, గిరిజన గురుకుల పాఠశాల, ఇరిగేషన్ లిప్టులు తీసుకొచ్చానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక కుటుంబ సభ్యుల కన్నా ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చానన్నారు. తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని, గెలిచిన ఆరునెలల్లో పేదలకు 1000 ఇండ్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 31న జరగనున్న సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, బెల్లంకొండ అమర్ గౌడ్, జల్లేపల్లి వెంకటేశ్వర్లు, సోమగాని ప్రదీప్ పాల్గొన్నారు.