వరల్డ్ కప్ ఓటమి తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సిల్వర్ వుడ్ తన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని.. కుటుంబంతో తన సమయాన్ని కేటాయించాలని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో లంక జట్టుకు కొత్త కోచ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది.
సెప్టెంబరు 2024లో ఇంగ్లండ్‌లో శ్రీలంక పర్యటన పూర్తయ్యే వరకు జయసూర్య కోచ్ గా కొనసాగుతారని శ్రీలంక క్రికెట్ (SLC) ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశంలో శ్రీలంక జూలై నెలాఖరులో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచి జయసూర్య కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవంతో కొత్త కోచ్ ను ప్రకటించే వరకు జయసూర్య జట్టుకు కోచ్ గా ఉంటాడని శ్రీలంక క్రికెట్ సిఇఒ ఆష్లే డిసిల్వా అన్నారు.
జయసూర్య ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక కన్సల్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. శ్రీలంక తరపున 1991 నుండి 2007 వరకు జయసూర్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 110 టెస్ట్ మ్యాచ్ ల్లో 40.07 సగటుతో 6973 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 445 వన్డేల్లో 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 13 వేలకు పైగా పరుగులు చేశాడు.
Sanath Jayasuriya has been appointed as Sri Lanka's interim Head Coach. (Espncricinfo). pic.twitter.com/Ju718URByd
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024