
- ఫుట్‌పాత్‌పై పడుకున్న 8 నెలల బాలుడు కిడ్నాప్
- 20 ఏండ్లయినా పిల్లలు పుట్టకపోవడంతోనే తీసుకెళ్లినట్లు వెల్లడి
- కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసిన సనత్‌నగర్ పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ ఫతేనగర్‌లో 8 నెలల బాబును కిడ్నాప్ చేసిన దుండగుడిని సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కుటుంబం ఫుట్‌పాత్‌పై పడుకున్నది. అందులో 8 నెలల బాబు నోట్లో పాల పీక పెట్టి దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్‌తో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 20 ఏండ్లయినా పిల్లలు పుట్టకపోవడంతోనే బాలుడిని ఎత్తుకెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. యూపీకి చెందిన కలివాల రాధే, అతని భార్య గీత.. ఫతేనగర్‌లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 8 ఏండ్ల, 8 నెలల ఇద్దరు బాబులు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన నలుగురు ఫుట్‌పాత్‌పై పడుకున్నారు.
డ్రైవర్‌గా పని చేస్తున్న నిందితుడు
బిహార్‌కు చెందిన సత్యనారాయణ రామ్ (43) బాలానగర్ పరిధిలోని గౌతమ్‌నగర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 ఏండ్ల కింద శోభాదేవితో పెండ్లి అయింది. వీరికి పిల్లల్లేరు. ఏజెన్సీల ద్వారా పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలో తెల్వదు. దీంతో మగ పిల్లాడిని ఎత్తుకొచ్చి పెంచుకోవాలని అనుకున్నరు. రోడ్డుపక్కన ఉండే వాళ్ల దగ్గర నుంచి పిల్లలను ఎత్తుకొస్తే ఎలాంటి సమస్య ఉండదని సత్యనారాయణ రామ్ భావించాడు. తన ఫ్రెండ్ సన్ని కుమార్ పాండేతో కలిసి స్కెచ్ వేశాడు. ఫతేనగర్‌లో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడుకునే గీత ఫ్యామిలీని గమనించాడు. 8 నెలల బాబును కిడ్నాప్ చేయాలని అనుకున్నడు. ఈ నెల 23న అర్ధరాత్రి సత్యనారాయణ రామ్, సన్నీ కుమార్ పాండే కలిసి ఓ పాల డబ్బా, పాల పీక కొనుక్కొని ఫతేనగర్ రోడ్డుపక్కన పడుకున్న గీత ఫ్యామిలీ వద్దకెళ్లారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాబు ఏడ్వకుండా అతని నోట్లో పాల పీక పెట్టి ఆటోలో ఎత్తుకెళ్లిపోయారు. కొద్దిసేపటికి కలివాల రాధే లేచి చూడగా.. పిల్లాడు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించిన సనత్‌నగర్ పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.