కుల గణనకు 75 ప్రశ్నలు ఎందుకు?

  • సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్ ప్రశ్న
  • కాలయాపన కోసమే సమగ్ర కుటుంబ సర్వే అని విమర్శ 

పద్మారావునగర్​, వెలుగు: కుల గణన చేపట్టేందుకు సర్వేలో 75 అంశాలతో కూడిన ప్రశ్నలు ఎందుకని సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ఎలాంటి ఉపయోగం ఉండబోదని, కేవలం కాలయాపన, ప్రజలను మభ్య పెట్టేందుకే చేపట్టారని విమర్శించారు. పొంతన లేని సమాచారం అడుగుతున్నారంటూ జనం ఇంటి ముందుకు వచ్చిన ఎన్యుమరేటర్లపై ఫైర్​అవుతున్నారని చెప్పారు.

   
తమ పార్టీ హయాంలో ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని తెలిపారు. సర్వే పూర్తి కాకుండా, బీసీల రిజర్వేషన్లను తేల్చకుండా సర్పంచ్ ఎన్నికలపై ఎలా ప్రకటన చేస్తారని తలసాని ప్రశ్నించారు. సోమవారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మనగర్ డీ క్లాస్ లో రూ. 71 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. అక్కడి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోయిగూడలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని సందర్శిం చారు. సమస్యలపై పూర్తిస్థాయి ప్రతిపాదనలను అందజేయాలని అధికారులను కార్పొరేటర్ కుర్మ హేమలత, కాలేజీ ప్రిన్సిపాల్ భారతి, టీజీఎమ్ఎస్​ఐడీసీ డీఈ  అజయ్ కుమార్, జీహెచ్ఎంసీ డీసీ  సమ్మయ్య, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, శానిటేషన్ డీఈ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మిత, ఎలక్ట్రికల్ ఏడీఈ దుర్గాప్రసాద్ ఉన్నారు.