కొత్త మున్సిపాలిటీలకు పోస్టులు శాంక్షన్ చేయండి.. సర్కారుకు మున్సిపల్ శాఖ లేఖ

కొత్త మున్సిపాలిటీలకు పోస్టులు శాంక్షన్ చేయండి.. సర్కారుకు మున్సిపల్ శాఖ లేఖ
  • ఇటీవల 18 కొత్త మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల ఏర్పాటు
  • ఒక్కో మున్సిపాలిటీకి 36, కార్పొరేషన్​కు 150–250 పోస్టులు అవసరం

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ లేఖ రాసింది. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీలుగా.. మరికొన్ని చోట్ల మున్సిపాలిటీలకు కొన్ని గ్రామాలు కలిపి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయగా.. కరీంనగర్ కార్పొరేషన్ లో కొత్తగా కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేశారు.

ఇటీవల  రెండు దశల్లో 18 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల(మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం)ను సర్కారు ఏర్పాటు చేసింది. తొలి దశలో 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన మున్సిపల్ యాక్ట్ సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండో దశలో 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ (కొత్తగూడెం) ఏర్పాటుకు పెట్టిన బిల్లుకు నేడో రేపో గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. తొలి దశలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇదివరకే కమిషనర్లను నియమించారు.  

1,100 మంది అవసరం..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అడ్మినిస్ర్టేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్, శానిటేషన్, అకౌంట్స్, రెవెన్యూ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల నుంచి ఒక్కో మున్సిపాలిటీకి  సుమారు 36 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని, కార్పొరేషన్ కు 150 నుంచి 250 మంది అవసరమని అధికారులు అంచనా వేశారు. 18 మున్సిపాలిటీలకు648 మంది, 3 కార్పోర్పొరేషన్లకు 500 మంది మొత్తం  1,100 మంది అవసరం కానున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే పోస్టులు మంజూరు చేస్తుందని అధికారులు అంటున్నారు.

ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఉత్తర్వులు వచ్చాక టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఇందులో మున్సిపల్ కమిషనర్ నుంచి ఈఈ, డీఈఈ, ఏఈ, డ్రాఫ్ట్ మెన్, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సూపర్ వైజర్, శానిటేషన్ సూపర్ వైజర్లు, ఇన్ స్పెక్టర్లు, మేనేజర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ టాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లు, అకౌంటెట్లు, ప్రాజెక్టు ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్ లు ఉంటారు. మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామ పంచాయతీల నుంచి పంచాయతీ సెక్రటరీలు, శానిటేషన్, మల్టీ పర్పస్ వర్కర్లు, వాటర్ బాయ్ లు, లైన్ మెన్ల వంటి వారు ఆయా మున్సిపాలిటీల్లో కలిశారు. వారికి అదనంగానే ఈ స్టాఫ్ అవసరం అని అధికారులు తేల్చారు.   

కొత్త మున్సిపాలిటీలు ఇవే..
తొలి దశలో ప్రభుత్వం మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, సంగారెడ్డి జిల్లా కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, నారాయణపేట జిల్లా మద్దూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ఏదులాపురం, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా దేవరకద్ర, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేవెళ్లను.. రెండో దశలో ములుగు, ఖమ్మం జిల్లా కల్లూరు, నిజామాబాద్ జిల్లా బిచుకుంద, మేడ్చల్ జిల్లాలో అలియాబాద్, ఎల్లంపేట, మూడు చింతలపల్లిని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. రెండో దశలో కొత్తగూడెం, పాల్వంచను కలిపి కొత్త కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు.