- ఏపీలో వేల ఎకరాల్లో పంట పొలాల్లో పేరకుపోయిన ఇసుక
- అగ్రికల్చర్, విద్యుత్ శాఖలకు రూ.కోటి మేర నష్టం
- ఇరిగేషన్ శాఖకు రూ. 20కోట్లు కావాలి
- తాత్కాలిక పనుల కోసం రూ. 5కోట్లిస్తేనే ఖరీఫ్‌లో సాగు
- ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ కేటాయిస్తేనే పెద్ద వాగు ప్రాజెక్టుకు రిపేర్లు
- వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్ట్‌కు గురువారం రాత్రి గండి పడడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. వారి నారుమల్లు, నాట్లు కొట్టుకుపోయాయి. తెలంగాణలో 600 ఎకరాల్లో, ఏపీలో వేల ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు ఏపీలో 75శాతం, తెలంగాణలో 25శాతం ఉంది.
రాష్ట్రంలోని అశ్వారావుపేటలో దాదాపు 2,300 ఆయకట్టు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పెద్ద చెరువుకు పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫండ్స్ ఇవ్వాల్సి ఉంది. దీనికి రూ. 15కోట్ల నుంచి రూ. 20కోట్ల వరకు అవసరం ఉంటుందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో తెలంగాణ రూ. 4కోట్ల నుంచి రూ. 5కోట్లు, ఏపీ రూ.10 లక్షల నుంచి రూ.15 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ ఆఫీసర్లు భావిస్తున్నారు. చెరువులో రింగ్ బండ్ ఏర్పాటు చేసి కొన్ని రిపేర్లు చేస్తే ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అవకాశాలున్నాయి.
స్థానికులకు తీరని నష్టం..
పెద్ద వాగు ప్రాజెక్టుకు గండి పడడంతో అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాలకు తీరని నష్టం కలిగింది. వరద ప్రవాహ దాటికి గుమ్మడవల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. ముందస్తు చర్యలో భాగంగానే అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కానీ ఇండ్లల్లోని సామగ్రి, ఆవులు, గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకున్న బాధితులు అక్కడి పరిస్థితులను చూసి తల్లడిల్లిపోయారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రాథమిక అంచనా ప్రకారంగా దాదాపు 600ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టుగా గుర్తించారు.
మరో 25 నుంచి 50 ఎకరాల్లో వరి నారు కొట్టుకుపోయింది. ఈ ఏడాది మంచిగా వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పెద్దవాగుకు పడిన గండి స్థానిక రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. విద్యుత్ స్థంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతినడంతో ఆయా శాఖలకు దాదాపు రూ. కోటికి పైగా నష్టం వాటిల్లినట్టుగా ఆఫీసర్లు అంచనా వేశారు. కాగా పొలాల్లో ఇసుక తొలగించడం తమకు ఆర్థిక భారమని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ
వరద ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పర్యటించారు. కలెక్టర్, ఎస్పీ నైట్అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కలెక్టర్‌తో ఎప్పటి కప్పుడు ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. గుమ్మడపల్లి గ్రామస్తులకు భోజన ఏర్పాట్లు చేశారు.
గతంలో చెప్పినా పట్టించుకోలే..
పెద్దవాగు ప్రాజెక్టుకు రిపేర్లు చేపట్టాలని పలుమార్లు ఆయకట్టు రైతులు గతంలోని కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టిన దాఖలాలున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పెద్ద చెరువు రిపేర్ల కోసం రెండేండ్ల కిందట కేవలం రూ. 1.40కోట్లు కేటాయించింది. కాగా పనులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో వర్క్స్ ఇష్టారాజ్యంగా సాగాయి.
గురువారం రాత్రి చెరువులోకి భారీగా వరద వచ్చిన టైంలో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తేందుకు ఆఫీసర్లు యత్నించారు. రెండు గేట్లు ఎత్తగా మరో గేట్ మొరాయించింది. చాలా సేపు యత్నించిన తర్వాత ఆ గేట్ ఓపెన్ అయింది. కానీ ఈ లోపు భారీగా వరద రావడంతో కట్టకు గండి పడింది. పెద్ద చెరువు ప్రాజెక్ట్ 40వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే విధంగానే డిజైన్ చేశారు. కానీ గురువారం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో దాదాపు రెట్టింపు స్థాయిలో వరద రావడంతో కట్ట తట్టుకోలేని పరిస్థితిలో దాదాపు 137 మీటర్ల నుంచి 150 మీటర్ల మేర కట్టకు గండి పడింది.