- 10 నెలల్లో 104 మంది మృతి
- టిప్పర్లతోనే ఎక్కువ చావులు
- రోడ్లపై అడ్డగోలుగా దూసుకెళ్తున్న ఇసుక, మట్టి లారీలు
- చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఆఫీసర్లు, పోలీసులు
- అధికార బలంతో మేనేజ్చేస్తున్న కాంట్రాక్టర్లు, ఓనర్లు
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ఇసుక, మట్టి టిప్పర్లు, లారీలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గత10 నెలల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 104 మంది చనిపోగా, 290 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో అత్యధికంగా ఇసుక టిప్పర్లు గుద్దడం వల్లే చనిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనూ వందల మంది టిప్పర్లు, లారీల కింద పడి చనిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇసుక, మట్టి తరలించే టిప్పర్లు, లారీలు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. కంట్రోల్ చేయాల్సిన సంబంధిత శాఖల ఆఫీసర్లు సంబంధిత కాంట్రాక్టర్లు, ఓనర్లు, డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవడం లేదని, పోలీసులు కూడా నామ్‌కే వాస్తే కేసులు పెట్టి వదిలేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు..
కొట్టె అజయ్ ఈ నెల10న , తిర్రి రోహిత్ 14న పెద్దపల్లి మండలం సబ్బితం దగ్గరలో ఇసుక, మట్టి టిప్పర్ల కింద పడి చనిపోయారు. ఇద్దరూ30 ఏండ్ల లోపు వారే కావడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇద్దరూ ప్రైవేట్జాబ్స్ చేసుకుంటుండగా.. అజయ్‌కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. రోహిత్‌కు ఇంకా పెళ్లి కాలేదు. వ్యక్తిగత పనులపై వెళ్లి రాత్రివేళ ఇండ్లకు బైక్‌లపై వస్తున్న క్రమంలోనే ఈ రెండు యాక్సిడెంట్లు జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆఫీసర్ల చర్యలు నిల్..
తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా.. కంట్రోల్చేసేందుకు సంబంధిత శాఖల ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా తీసుకుంటలేరని విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ధర్మారం రోడ్డులో జరిగిన సంఘటనలపై ప్రజలు ఎన్నోసార్లు ఆందోళనలకు దిగినా మట్టి ఇసుక లారీలతో జరుగుతున్న యాక్సిడెంట్లపైన చర్యలు లేవు.
స్థానికుల్లో భయం.. భయం..
జిల్లాలో మనుషులను నిత్యం టిప్పర్లు, లారీలు తొక్కి చంపుతుండడంతో స్థానికులు భయం భయంగా బతుకుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు లారీ డ్రైవర్లపై, ఇసుక కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో మట్టి టిప్పర్ అప్పన్నపేట గ్రామంలో మహిళ కాళ్లపై నుంచి వెళ్లడంతో కాలు పూర్తిగా తెగిపోయింది. పెద్దపల్లి పట్టణ నడిబొడ్డులో ఏఎస్సై భాగ్యలక్ష్మిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బాడీ ఛిద్రమైంది. పెగడపల్లి గ్రామంలో బాలుడి నడుముపై లారీ టైర్ ఎక్కడంతో మధ్యలోకి తెగిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసు ఆఫీసర్లు టిప్పర్లు, లారీలపై ఫోకస్‌పెట్టి ప్రమాదాలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.