అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లు సీజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కార్యకలాపాలపై పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టగా.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక వ్యాపారం చేస్తున్న వారి గుట్టు రట్టయింది. ఇల్లందులో అక్రమంగా తరలిస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను  టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. బాధ్యులైన 11 మందిపై కేసులు నమోదు చేశారు. 
టేకులపల్లి మండలం ముర్రేడు వాగుపై నుండి  ఇల్లందుకు అక్రమంగా తీసుకుని వచ్చిన ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. గత కొంత కాలంగా టేకులపల్లి, బొమ్మనపల్లి, ఒడ్డుగూడెం, ఇల్లందు ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్ యాజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్న వారు ఇల్లందు నియోజకవర్గంలోని కొన్ని  ప్రాంతాలకు ఇసుక సరఫరా చేస్తున్నట్లు తేలింది. తరచూ వస్తున్న మౌఖిక ఫిర్యాదులపై నిఘా పెట్టగా.. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ వేణు చందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఇసుకను రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను సీజ్ చేసి ఇల్లందు పోలీస్ స్టేషన్ కు తరలించారు.