నాగులపేట్ గ్రామంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఇసుక వివాదం

 కోరుట్ల రూరల్, వెలుగు: కోరుట్ల మండలం నాగులపేట్ గ్రామంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఇసుక రవాణా విషయంలో వివాదం తలెత్తింది. రెండు రోజుల కింద నాగులపేట్‌‌‌‌‌‌‌‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 1568 ట్రాక్టర్ల ఇసుక డంపులను ఆఫీసర్లు సీజ్ చేశారు. ఈ క్రమంలో శనివారం ఇసుక డంపులను తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

దీంతో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. సీజ్ చేసిన ఇసుకను వేలం వేయకుండా తరలించడమేంటని గ్రామస్తులు ప్రశ్నించారు.  డీడీలు కట్టినా గ్రామస్తులకు ఇసుక ఇవ్వకుండా తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూల్స్​ప్రకారమే ఇసుకను తరలిస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను చెదరగొట్టారు.