త్వరలో ఇసుక డోర్​ డెలివరీ.. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపి టన్ను ఎంతంటే..

త్వరలో ఇసుక డోర్​ డెలివరీ.. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్తో కలిపి టన్ను ఎంతంటే..
  • ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్న టీజీఎండీసీ
  • ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
  • ఫిర్యాదు చేసేందుకు నంబర్లు 98480 94373, 70939 14343
  • ఆన్​లైన్లో 24/7 ఇసుక బుక్ చేసుకోవచ్చు
  • హైదరాబాద్కు ట్రాన్స్​పోర్ట్తో కలిపి టన్ను రూ.1600 లోపే..
  • వివరాలు వెల్లడించిన టీజీఎండీసీ ప్రిన్సిపల్ ​సెక్రటరీ ఎన్.శ్రీధర్

హైదరాబాద్, వెలుగు: ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి అవసరాల కోసం ఎవరైతే ఇసుకను ఆన్​లైన్​లో బుక్​ చేసుకుంటారో.. వారి ప్రాంతానికే నేరుగా నిర్దేశించిన లారీ లోడ్ పంపనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్​ను ‘తెలంగాణ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్’​ రూపొందిస్తున్నది. 45 రోజుల్లోపు ఈ యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలపై ఆయన మైనింగ్ డైరెక్టర్ శశాంక, టీజీఎండీసీ ఎం.డీ సుశీల్ తో కలిసి సోమవారం సెక్రటేరియెట్లో మీడియాతో మాట్లాడారు. అవసరం ఉన్న ఎవరైనా సరే ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ఇసుకను బుక్​ చేసుకునేలా యాప్ పనిచేస్తుందన్నారు. ఇందులో ట్రాన్స్​పోర్ట్ వాళ్లను కూడా భాగస్వాములుగా చేస్తున్నామన్నారు. కిలో మీటరుకు ఇంత చొప్పున అని రేటు ఫిక్స్​ చేస్తామని తెలిపారు.

ఇప్పుడు ఇసుకకు టన్నుకు రూ.405 ఉందని.. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కలిపితే టన్నుకు రూ.1600 లోపే ఉండాలన్నారు. ఇంతకంటే ఎక్కువ ఎవరూ చెల్లించొద్దని స్పష్టం చేశారు. ఇక ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే కంప్లైంట్ చేయడానికి నంబర్స్ 98480 94373, 70939 14343 ఏర్పాట్లు చేశామని.. ఎవరైనా, ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. 

అలాగే ఇసుక కొరత ఉందనే వార్తలను శ్రీధర్ ​ఖండించారు. రాష్ట్రంలో ఇసుక పుష్కలంగా ఉందని, 8 లక్షల క్యూబిక్ మీటర్ల  ​ఇసుక అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇది కాకుండా ప్రతిరోజు 75 వేల క్యూబిక్​ మీటర్ల ఇసుకను తీస్తున్నామని.. అందులో ఇప్పుడు 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

ఇసుక లోడింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, తెలంగాణ ఆరు జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎక్కువగా ఇసుక వస్తుందన్నారు. సీఎం ఆదేశం తర్వాత 1,529 వెహికల్స్ చెక్ చేసి 136 కు పైగా కేసులు, 111 వెహికల్స్ సీజ్, 21 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. ఓవర్ లోడ్తో ఇసుక తరలిస్తున్న వాళ్లను బ్లాక్ లిస్ట్లో పెడతామన్నారు. 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చామని, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవన్నారు. రాబోయే 40 రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ, ప్రతీ జీపీఎస్, వేవ్ బ్రిడ్జిలు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ డిపార్ట్​మెంట్కు ఇసుకతీతకు అనుమతించామని.. అక్కడ కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే అక్కడి నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నారనే కంప్లయింట్స్ అందాయని దీంతో ఆ ప్రాంతాల్లోనూ నిఘా పెట్టి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టేట్ లెవల్ లో అన్ని శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, జెన్యూన్ గా చేసే వాళ్లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీకి ఇసుక కోసం ఓఆర్​ఆర్​ పరిధిలో ఏడెనిమిది ఇసుక యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాటి ద్వారా గతేడాది రూ.567 కోట్ల రెవెన్యూ రాగా, ఈ ఏడాది రూ.627 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు రెగ్యులర్గా తనిఖీలు చేయాలి: సీఎం రేవంత్​రెడ్డి
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఇసుక రీచ్‌లను రెగ్యులర్​గా తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు  మరోసారి సూచించారు. ఓవర్‌లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ మెరాలు, స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.