ఇసుకాసురులు .. జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ

ఇసుకాసురులు .. జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ
  • మూడు పర్మిషన్లు 30 ట్రిప్పుల ఇసుక తరలింపు 
  • జేసీబీలు, డోజర్లతో మంజీరాను తవ్వేస్తుండ్రు 
  • రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లతో ములాఖాత్​

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఒక ట్రిప్పు పర్మిషన్​ తీసుకొని పది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. వాల్టాచట్టాన్ని కాపాడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.  నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తుండడంతో పంట పొలాలపై  దట్టమైన దుమ్ముపర్చుకుని నష్టపోతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలోని మంజీరా నది, వాగుల నుంచి నిత్యం రూ. కోట్లలో ఇసుక వ్యాపారం సాగుతుండడం విశేషం. 

ఖండ్​గావ్​లో క్వారీ.. ట్రిప్పుకు రూ.8 వేలు వసూలు.. 

బోధన్​, సాలూరా మండలంలోని మంజీరా నదిలో ఇసుక నిల్వలను భారీగా కొల్లగొడుతున్నారు.  ఇండ్ల నిర్మాణాలకు తహసీల్దార్​లు టిప్పర్​కు రూ.4 వేలు, ట్రాక్టర్​కు రూ.670 చలానా కట్టించుకొని పర్మిషన్లు  ఇస్తున్నారు. ఖండ్​గావ్ వద్ద క్వారీ నిర్వహిస్తున్న ఒక పార్టీ లీడర్ టిప్పర్​కు రూ.8 వేలు తీసుకొని లోడింగ్ చేయిస్తున్నాడు. నిత్యం దాదాపు 80 టిప్పర్ల ఇసుక తరలిస్తూ సుమారు రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు.  నది నుంచి ట్రాక్టర్లలో ఒడ్డుకు చేర్చిన ఇసుకను డోజర్లతో నింపి పంపుతున్నాడు. 20 టన్నులకు మించి లోడ్​తో టిప్పర్లు వెళ్లడంతో బండారుపల్లి, శ్రీనివాస్​నగర్​, చిన్నమావంది, పెగడాపల్లి తదితర ఎనిమిది గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. కారులో తిరుగుతూ గ్యాంగ్​ మెయింటెన్ చేస్తున్న క్వారీ నిర్వాహకుడు అధికారులకు మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతా మూమూళ్లే.. 

ఇసుక దందా చేస్తున్న వ్యాపారులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఒక్కో టిప్పర్​కు రూ.వెయ్యి చొప్పున ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఎక్కువగా  ట్రాన్స్​పోర్టు శాఖ రూ.3​,500 వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. లంచాలు ఇవ్వకుండా ఇసుక రవాణా చేస్తేటిప్పర్లను పట్టుకుని టన్నుకు రూ.10 వేల  ఫైన్​ వేస్తున్నారు.  గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇసుక ట్రాక్టర్లకు అనుమతి ఉంది. కూలీలతోనే ట్రాక్టర్లు నింపుకోవాల్సి ఉండగా జేసీబీ, డోజర్లతో నింపుతున్నారు. 

  గత శనివారం బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి ఏడు టన్నులకు మించి టిప్పర్​లలో ఇసుక వెళ్లకుండా చూడాలని ఆదేశించినా అమలు కావడం లేదు. ఇచ్చిన పర్మిషన్లకు పొంతన లేకుండా ట్రాన్స్​పోర్టు అవుతున్నా అధికారులు  ఫోకస్​ పెట్టడం లేదు. ఎర్గట్ల మండలం భట్టాపూర్ లో ఇసుక తవ్వకాలకు వాడుతున్న పొక్లెయినర్​ను శనివారం మైన్స్ ఆఫీసర్లు సీజ్​ చేయగా ఆదివారం నుంచే మరో పొక్లెయినర్​తో తవ్వకాలు చేపడుతుండడం విశేషం.  

రూ. కోట్లల్లో వ్యాపారం..

అక్రమ ఇసుక రవాణాతో వ్యాపారులు రూ. కోట్లు గడిస్తున్నారు.  అడ్డూఅదుపు లేకుండా ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇసుకను నిజామాబాద్​ చేర్చుతున్న వ్యాపారులు టన్నుకు రూ.1,350 చొప్పున అమ్ముతున్నారు. మందర్నా, తగ్గెల్లి, కల్దుర్కిలో ట్రాక్టర్లతో తోలుతున్న ఇసుకను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు.  రెంజల్ మండలం నీలా వాగు, మాక్లూర్ మండలంలోని వాగుల నుంచి రోజుకు వంద టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఓ పొలిటికల్ పార్టీ లీడర్ అండతో లిక్కర్​ బిజినెస్​ చేసే ఓ బడా వ్యక్తి ఎర్గట్ల మండలం భట్టాపూర్ వాగు నుంచి ఈ ఇసుక దందా సాగిస్తున్నట్లు సమాచారం.