- ప్రతీ రోజు రూ.కోట్లల్లో నష్టం
- మామూళ్లు తీసుకుని సహకరిస్తున్న సూపర్‌వైజర్లు
- పోలీసులు పట్టుకున్నా నామమాత్ర విచారణతో సరి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ములుగు జిల్లాలో ఇసుక లారీలు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తుండడంతో పోలీసులు గత నెల 9వ తేదీ రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాజేడు, వెంకటాపురం మండలాల నుంచి మొదలుకొని ములుగు జిల్లా సరిహద్దు వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. ఏకకాలంలో జరిపిన ఈ దాడుల్లో ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న 40 లారీలను సీజ్ చేశారు. మొత్తం తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో 50 కేసులు నమోదు చేసి రూ.1.11 లక్షల విలువ చేసే 298 మెట్రిక్ టన్నుల ఓవర్‌లోడ్ ఇసుకను రికవరీ చేశారు. ఇది జరిగి నెల రోజులు కావస్తోంది. అయినా ఇసుక లారీల ఓనర్లు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ లారీల్లో ఇసుక ఓవర్ లోడ్ వేసుకొని దందా చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 24 ఇసుక క్వారీలను నిర్వహిస్తుండగా, వీటిలో అత్యధికంగా ములుగు జిల్లాలో 10, భూపాలపల్లి జిల్లాలో 9, భద్రాద్రి కొత్తగూడెంలో 2, కామారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో ఒక ఇసుక క్వారీ ఉంది. అయితే, వీటిలో ములుగు, భూపాలపల్లి జిల్లాలోని ఇసుక క్వారీలకే లారీలు ఎక్కువగా క్యూ కడుతున్నాయి. ఇక్కడి క్వారీల్లో పరిమితికి మించి ఇసుక లోడ్ చేసి పంపిస్తున్నారు. దీంతో ఆదాయం ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఇసుక వ్యాపారులు ఈ రెండు జిల్లాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇసుక దోపిడీపై ఫిర్యాదులు
ఇసుక కావాలంటే టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మెట్రిక్ టన్ను ఇసుక కోసం రూ.375 చొప్పున చెల్లించి వే బిల్లులు పొందాలి. ఈ వే బిల్లులు తీసుకెళ్లి ఇసుక క్వారీ వద్ద ఉండే టీఎస్‌ఎండీసీ సూపర్వైజర్కు అందజేయాలి. అతను ఆన్‌లైన్‌లో వే బిల్లులను పరిశీలించి సరైనదిగా ధృవీకరించిన తర్వాతే లారీల్లో ఇసుక నింపడానికి అనుమతించాలి. అయితే, రోజుకు రూ.20 లక్షలకు మించి..నెలకు రూ.6 కోట్లకుపైగా విలువ చేసే ఇసుకను కొందరు దోపిడీ చేస్తున్నట్లుగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఫిర్యాదులందాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాకు ప్రతి రోజు1500 నుంచి 2 వేల వరకు ఇసుక లారీలు వస్తున్నాయి. 10 టైర్ల లారీలో 19.5 టన్నులు, 12 టైర్ల లారీలో 26 టన్నులు, 14 టైర్ల లారీలో 32 టన్నుల ఇసుక నింపాలి. కానీ, ఒక్కొక్క లారీలో అదనంగా జేసీబీ బకెట్‌తో ఇసుక నింపుతున్నారు. ఒక బకెట్ ఇసుక అదనంగా నింపడానికి ఇసుక క్వారీ యజమానులు రూ.1500 నుంచి రూ.2 వేలు లంచంగా తీసుకుంటున్నారు. జేసీబీ ఆపరేటర్‌కు రూ.300 చెల్లిస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి టీఎస్‌ఎండీసీ సూపర్‌వైజర్లు డబ్బులు తీసుకొని సహకరిస్తున్నారని తెలిసింది.
అంతా ఇష్టారాజ్యం
ఇసుక క్వారీలను ప్రభుత్వం నుంచి పొందిన యజమానులు, వారి బంధువులకు చెందిన లారీల్లో ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా, ఎలాంటి వే బిల్లులు లేకుండా అదనంగా ఇసుక నింపి పంపిస్తున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక క్వారీలు నిర్వహించే వారికి ఒక్కొక్కరికి 20కి పైగా ఇసుక లారీలున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి రోజు ఎలాంటి వే బిల్లులు లేకుండానే ఇసుక నింపుకొని ఓవర్‌లోడ్‌తో దర్జాగా క్వారీల నుంచి బయటికి వెళ్తుంటాయి.
అంతా పలుకుబడి ఉన్నోళ్లే..
రాష్ట్రంలో వివిధ పార్టీల లీడర్లు, వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన ఆఫీసర్లు, రాజకీయ పలుకుబడి ఉన్నవారంతా ఇసుక వ్యాపారంలో ఉన్నారు. సొంతంగానే కాక బినామీల పేరిట కూడా లారీలు కొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా ఇసుకను ఓవర్‌లోడ్‌తో నింపుకొని వెళ్లి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. టీఎస్‌ఎండీసీ ఆఫీసర్లు, సిబ్బంది మామూళ్లు తీసుకొని వీరికి సహకరిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్ల నష్టం జరుగుతోంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇటీవల పదుల సంఖ్యలో ఇసుక లారీలు ఓవర్‌లోడ్‌తో పట్టుబడ్డాయి. ఈ లారీల గురించి పోలీసులు లోతైన విచారణ జరిపితే పలుకుబడి ఉన్న వ్యక్తులే ఈ వ్యాపారంలో ఉన్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు నామమాత్రంగా ఎంక్వైరీ చేసి వదిలేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి ప్రతి రోజు రెండు, మూడు వేల ఇసుక లారీలు ఇసుక నింపుకొని వెళ్తే, అందులో 600 దాకా లారీలు ఓవర్‌లోడ్ తోటే అతివేగంగా ప్రయాణిస్తుంటాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ఓవర్‌లోడ్‌తో వెళ్తే సీజ్ చేస్తాం
ఇసుక లారీలు పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో పోతే వెంటనే వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేసినా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
‒ శబరీశ్, ములుగు ఎస్పీ