- తప్పించుకున్న అధికారి, సిబ్బంది
- ధ్వంసమైన కారు వెనక భాగం
- ట్రాక్టర్ల స్వాధీనం.. డ్రైవర్ల పట్టివేత
- భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఫారెస్ట్ రేంజ్ రోళ్లపాడు వద్ద ఘటన
ఇల్లెందు, వెలుగు : భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్అధికారులపైకి ట్రాక్టర్ఎక్కించి చంపే ప్రయత్నం చేశారు. టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద ఇసుక ట్రాక్టర్లతో ఢీకొట్టాలని చూడగా అధికారులు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కారు నుంచి దూకి తప్పించుకున్నారు. తర్వాత ట్రాక్టర్లను సీజ్‌చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లెందు ఎఫ్డీఓ వెంకన్న కథనం ప్రకారం..ఇల్లెందు ఫారెస్ట్డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి టేకులపల్లి మండలం మీదుగా కొన్నాళ్లుగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎఫ్ఆర్వోతో ఓ టీం ఏర్పాటు చేశారు. అటవీశాఖ వాహనాలను ఇసుక మాఫియా పసిగడుతుండడంతో ప్రైవేట్‌వాహనాల్లో తిరుగుతూ నిఘా పెంచారు. ఈ క్రమం లో మంగళవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు కొమరారం ఎఫ్ఆర్వో, ఐదుగురు సిబ్బంది ఓ కారులో వెళ్లారు. టేకులపల్లి మండలం సాయన్నపల్లి ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవాలని ప్రయత్నించారు. ఆపకపోవడంతో ఓవర్టేక్ చేసి ఓ ఇసుక ట్రాక్టర్ ముందు తమ వాహనాన్ని ఆపారు.
కారులోంచి దిగకముందే ట్రాక్టర్ డ్రైవర్ ఫారెస్ట్ సిబ్బంది వెహికల్‌పైకి తన వాహనాన్ని ఎక్కించబోయాడు. గమనించిన ఆఫీసర్, సిబ్బంది డోర్లు ఓపెన్ చేసుకుని పక్కకు దూకారు. ఈ ఘటనలో కారు వెనక వైపు అద్దాలు పగిలిపోగా, డిక్కీ భాగం ధ్వంసమైంది. సిబ్బంది, అధికారి కలిసి రెండు ఇసుక ట్రాక్టర్లను, ఇసుక డంపు చేసి వెళ్తున్న మరో ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలను డిపోకు తరలించారు. రెండేండ్ల కింద కూడా ఇలాగే టేకులపల్లి మండలంలో ఓ ఇసుక ట్రాక్టర్ ..ఫారెస్ట్ ఆఫీసర్ వెహికల్‌పైకి ఎక్కించడంతో డ్రైవర్ గాయపడ్డాడు.