బూర్గంపహాడ్,వెలుగు: ఇసుక అక్రమ రవాణాని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడికి దిగిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. సారపాక మండలం సారపాక, మోతె, తాళ్లగొమ్మూరు, ఉప్పుసాక, బుడ్డగూడెం గోదావరి, కిన్నెరసాని నది తీరాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. శనివారం అర్ధరాత్రి సారపాకలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. వెంటనే బూర్గంపహాడ్ డిప్యూటీ తహసీల్దార్ రాంనరేశ్, ఆర్ఐ ముత్తయ్య, సిబ్బంది వెళ్లారు. దీంతో ట్రాక్టర్ లోకి ఇసుక లోడింగ్ చేస్తున్న వారిలో కొందరు పరార్ అయ్యారు.
అధికారులను చూసిన వ్యక్తి ఆర్ఐ ముతయ్యపై దాడికి కర్రతో దిగాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకుని ఇసుక ట్రాక్టర్ తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక మాఫియా తమపై దాడికి పాల్పడుతున్న విషయాన్ని తెలిపేందుకు ఎస్ఐ రాజేశ్, పాల్వంచ సీఐలకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దాడికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్ఐ ముతయ్య తెలిపారు. ఘటనపై బూర్గంపహాడ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ ముజాహుద్ తెలిపారు.