ఇసుక తోడేస్తున్రు..చెలరేగి పోతున్న మాఫియా..

  •     అడ్డగోలు తవ్వకాలు
  •     పంట పొలాల్లో నిల్వలు.. రాత్రికి రాత్రే సరఫరా
  •     చర్యలు తీసుకోని ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా దందా జోరుగా సాగుతోంది. నదులు, వాగుల్లో నిత్యం అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ సహజ సంపదను కొల్ల గొడుతున్నారు. యథేచ్ఛగా తవ్వి గుట్టుచప్పుడు కాకుండా పంట పొలాల్లో టన్నుల కొద్ది ఇసుకను డంప్ చేస్తూ రాత్రికి రాత్రే సరఫరా చేస్తున్నారు. లారీల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, కరీంనగర్

మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు తరలిస్తున్నారు. అక్రమ వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండటంతో అక్రమ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమార్కుల ఈ బిజినెస్​మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ కోట్లు సంపాదిస్తున్నారు. 

రాజకీయ నేతల అండదండలు

ఇసుక అక్రమ రవాణాదారులకు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగు నుంచి ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తూ బాబాపూర్, గుండి, మోతుగుడా, వాంకిడి మండలం కనర్ గాం గ్రామ పరిసరాల్లోని వ్యవసాయ పంట పొలాల్లో డంప్​ చేస్తున్నారు. రెబ్బెన మండలంలోని గంగాపూర్ పెద్ద వాగు, పులికుంట వాగు, నవేగాం వాగు, కొండపల్లి, కాగజ్ నగర్ మండలం పెద్ద వాగు, కెరమెరి మండలం సాంగ్వి, ఖైరి, సిర్పూర్ టి మండలంలోని పెదబండ పెద్ద వాగుల

దహెగాం మండలం పెద్ద వాగులోనూ నిత్యం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరికొందరు గవర్నమెంట్ భవనాలు, సిమెంట్ రోడ్డు పనుల కోసమని తరలిస్తూ మరో చోట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న సిమెంట్ ఇటుకలు, స్తంభాలు తయారు చేసే యూనిట్ల యాజమాన్యూలు స్థానిక వాగుల నుంచి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వందలాది టన్నుల ఇసుక తోడుతున్నారు. ఇన్ని జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. 

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

పర్మిషన్ లేకుండా వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఆసిఫాబాద్​ జిల్లాలోని తహసీల్దార్లకు వే బిల్స్ ఇచ్చాం. ఇసుక తరలించే వారు తప్పనిసరిగా తహసీల్దార్ నుంచి వే బిల్ తీసుకోవాలి. అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. ఒక్కో ట్రాక్టర్​కు రూ. 5 వేల ఫైన్ వేస్తం.

నాగరాజు, భూగర్భ, గనుల శాఖ ఏడీ, ఆసిఫాబాద్