
- ఇష్టారీతిన తోడుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
- వానాకాలం కోసం స్టాక్‌యార్డులలో భారీగా నిల్వలు
- గోదావరి ఒడ్డున గుట్టలను తలపిస్తున్న ఇసుక డంపులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఇసుక దందాకు 'హద్దూ' అదుపు లేకుండా పోతోంది. రీచ్‌లకు కేటాయించిన పరిధులు దాటి గోదావరిలో ఎక్కడ పడితే అక్కడ తోడుతున్నారు. కొందరైతే ఈ వైపు నుంచి ఆ వైపునకు పోయి ఇసుక తీస్తున్నారు. గోదావరి ఒడ్లను తవ్వి ఆ మట్టితో టెంపరరీ రోడ్లు వేశారు. మరికొద్ది రోజుల్లో వానలు పడితే ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడుతుంది. దీంతో రెండు నెలల నుంచి విచ్చలవిడిగా తోడి ఒడ్డుకు డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్‌యార్డులలో ఇసుక డంపులు గుట్టలను తలపిస్తున్నాయి. ఓవర్‌లోడ్, జీరో దందా యథేచ్ఛగా సాగుతోంది.
వానాకాలం కోసం భారీగా డంపింగ్....
కోటపల్లి మండలం కొల్లూరు గోదావరిలో ఎనిమిది క్వారీలకు పర్మిషన్లు ఉండగా, ప్రస్తుతం నాలుగు నడుస్తున్నాయి. వానాకాలంలో గోదావరికి వరదలు రావడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బ్యాక్వాటర్చేరి ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతుంది. దాదాపు ఐదారు నెలలు నదిలోకి వాహనాలు వెళ్లే అవకాశం ఉండదు. మొన్నటివరకు వెలికి తీసిన ఇసుకను ఎప్పటికప్పుడు రవాణా చేశారు. వానాకాలంలో నాలుగైదు నెలలపాటు కొరత రాకుండా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున డంపులు ఏర్పాటు చేస్తున్నారు. కొల్లూరు గోదావరి ఒడ్డున స్టాక్‌యార్డులలో ఎటు చూసినా ఇసుక డంపులు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.
హద్దులు దాటి తవ్వకాలు...
ప్రభుత్వం గోదావరిలో ఇసుక రీచ్‌లకు పర్మిషన్లు ఇచ్చిన సమయంలోనే ఒక్కో రీచ్‌కు కొంత పరిధిని కేటాయిస్తుంది. కొల్లూరులో మొత్తం ఎనిమిది రీచ్‌లకు పర్మిషన్లు ఉండగా, ఒక్కో రీచ్‌కు 5లక్షల క్యూబిక్ మీటర్లు కేటాయించారు. అక్కడ ఉన్న ఇసుక నిల్వలను బట్టి రీచ్‌ల పరిధిని నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ఆ పరిధులు దాటి ఇసుక తీయడానికి వీల్లేదు. కానీ వాటిని ఎప్పుడో చెరిపేశారు. పక్కపక్కనే రీచ్‌లు ఉండడంతో ఎవరు ఎక్కడ తోడుతున్నారో, ఎన్ని క్యూబిక్‌మీటర్లు తీస్తున్నారో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
ఆగని ఓవర్‌లోడ్, జీరో దందా...
కొల్లూరు రీచ్‌లలో ఓవర్‌లోడ్, జీరో దందా జోరుగా సాగుతోంది. లారీల్లో కెపాసిటీకి మించి నాలుగైదు టన్నులు ఓవర్లోడ్పోస్తున్నారు. ఒక్కో బకెట్‌కు అదనంగా రూ.2 వేలు తీసుకుంటున్నారు. అంటే ఒక్కో లారీపై రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారంటే రోజుకు ఎన్ని లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారో ఊహించవచ్చు. ఇది చాలదన్నట్టు జీరో దందా కూడా నడిపిస్తున్నారు. కొల్లూరుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి ప్రతి రీచ్‌లో పార్టనర్‌గా ఉన్నాడు. అతడితో పాటు మరో మండల స్థాయి ప్రజాప్రతినిధి తెరవెనుక ఉండి జీరో దందా సాగిస్తున్నారు. ఒకే వేబిల్లుపై రెండు ట్రిప్పులు కొడుతున్నారు.
పట్టించుకోని అధికారులు...
గోదావరిలో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు సాగిస్తున్నప్పటికీ టీఎస్ఎండీసీ, మైనింగ్అధికారులు పట్టించుకోవడం లేదు. గోదావరిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు మట్టితో రోడ్లు వేశారు. జేసీబీలతో ఇసుక తోడి టిప్పర్లతో స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు. వాస్తవానికి మూడు మీటర్ల లోతు వరకు ఇసుక తీయడానికి పర్మిషన్ఉంటుంది. అయితే లోతుకు పోయిన కొద్దీ క్వాలిటీ తగ్గుతోంది. దీంతో కాంట్రాక్టర్లు నిర్దేశించిన ఏరియాలో కాకుండా ఎక్కడ మంచి ఇసుక ఉంటే అక్కడ తోడేస్తున్నారు.