- ఆంధ్రా బార్డర్ లో ఇసుక మాఫియా వర్గపోరు
- కోదాడ కేంద్రంగా ఆంధ్రా నుంచి ఇసుక అక్రమ రవాణా
- వే బ్రిడ్జిలు అడ్డాగా వ్యాపారం
- ఒకరిపై ఒకరు ఠాణాల్లో ఫిర్యాదులు
- చెప్పిన రేటుకు ఇసుక కొనాల్సిందే.. లేకుంటే ఇల్లు ఆగాల్సిందే
- పట్టించుకోని ఆఫీసర్లు
సూర్యాపేట/కోదాడ, వెలుగు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఆంధ్రా నుంచి తక్కువ ధరకు ఇసుకను తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆంధ్రా, తెలంగాణ బార్డర్లో రెండు గ్రూపులుగా ఇసుక వ్యాపారులు ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలతోపాటు కోదాడ పట్టణాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మార్చారు. గతంలో ఇసుక వ్యాపారాన్ని సిండికేట్ గా నిర్వహించిన వ్యాపారుల్లో విభేదాలు రావడంతో ఆధిపత్య పోరు మొదలైంది.
ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతోపాటు రాత్రి వేళల్లో గొడవలు, దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు పోలీసు, రెవెన్యూ, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. పైగా గొడవలు పడుతున్న వారికి సర్ది చెపుతూ రాజీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమార్కులు భారీ స్థాయిలో అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రా టు కోదాడ వయా కాపుగల్లు..
ఏపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దులోని కోదాడ కు ఇసుకను అక్రమ పద్ధతుల్లో వ్యాపారులు రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు నుంచి కోదాడ మండలంలోని కాపుగల్లు మీదుగా కోదాడకు ప్రతిరోజూ వందలాది లారీల ఇసుక అక్రమంగా వచ్చి చేరుతోంది. గతంలో సిండికేట్ గా వ్యాపారం నిర్వహించిన వ్యాపారులు తాము చెప్పిన రేటుకు ఇసుక అమ్మేవారు. పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ ఫ్లై ఓవర్ వద్ద అడ్డాను ఏర్పాటు చేసుకున్న వారు పట్టణంలో పలుచోట్ల డంపులు ఏర్పాటు చేసి రోజుకు లక్షల్లో వ్యాపారం చేశారు.
వీరికి ఆంధ్రా ప్రాంతంలో ఒక వ్యాపారి ఇసుక సప్లై చేసేవాడు. వ్యాపారంలో ఒక అడుగుముందుకు వేసి వే బ్రిడ్జి లను ఏర్పాటు చేసి వచ్చిన ఇసుక లారీలను అక్కడే నిలిపి వ్యాపారం సాగించారు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు రావడంతో ఒక వ్యాపారి ఆంధ్రా వ్యాపారితో చేతులు కలిపి ఫ్లై ఓవర్ సమీపంలోనే మరో వే బ్రిడ్జి ఏర్పాటు చేసి కొంత తక్కువ రేటుకు ఇసుక వ్యాపారం ప్రారంభించాడు.
అడ్డగోలుగా వ్యాపారం...ఆధిపత్య పోరు
గత వారం పట్టణంలోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద అర్ధరాత్రి చర్చల పేరుతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులకు తెలియడంతో వారు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో తాజాగా రెండు రోజుల క్రితం ఎనిమిది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
తరలింపునకు పర్మిషన్ తీసుకోకుండా..
ఏపీ నుంచి యథేచ్ఛగా రాత్రి వేళల్లో ఇసుక తరలివస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేదు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక తరలింపు పర్మిషన్లు జారీ చేస్తున్నామని ప్రైవేట్ పనులకు పర్మిషన్లు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నా రోజు కనీసం వంద లారీల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి.
ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలకు బిల్లులు ఉన్నా వాటిని మార్ఫింగ్ చేసి రెండు మూడు ట్రాక్టర్లకు లారీలకు పర్మిషన్ ఉన్నట్లు ఫేక్ బిల్లులు సృష్టిస్తూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇల్లు కట్టుకునే వారిని అడ్డు పెట్టుకొని సరిహద్దులోని పాలేరు వాగు వద్ద డంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లలో పగటి పూట ఇసుకను తరలించే అవకాశం ఉంది.
ఇసుక అక్రమ రవాణాపై చర్యలుచేపడతాం
ప్రభుత్వ పనులకు మాత్రమే చలానా కట్టించుకొని ఇసుక రవాణాకు పర్మిషన్లు జారీ చేస్తున్నాం. పట్టణంలో ఇసుక అక్రమ డంప్ ల ఏర్పాటుపై తగిన సమాచారం లేదు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
సాయగౌడ్, తహసీల్దార్, కోదాడ