ఇసుక తరలించేందుకు..కృష్ణా నదిలో రోడ్డు !..నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా నిర్వాకం !

ఇసుక తరలించేందుకు..కృష్ణా నదిలో రోడ్డు !..నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా నిర్వాకం !
  • రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకం
  • నదిలోని మట్టి రోడ్డు గుండా కర్నాటకకు తరలింపు
  • పట్టించుకోని ఆఫీసర్లు 
  • ఓ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే దందా జరుగుతున్నట్లు ప్రచారం

మహబూ‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తెలంగాణ నుంచి కర్నాటకకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తుండడంతో అక్రమార్కులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు.

ఇందుకోసం ఏకంగా కృష్ణా నదిలోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర మట్టి రోడ్డును వేసుకున్నారు. అర్ధరాత్రుళ్లు హిటాచీలతో నదిలో ఇసుకను తవ్వి టిప్పర్లలో నింపుతున్నారు. అనంతరం నదిలో ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డు ద్వారా కర్నాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అర్ధరాత్రి నదిలోకి..

కృష్ణా మండలం తంగిడి వద్ద నది కర్నాటక నుంచి తెలంగాణలోకి ఎంటర్‌‌‌‌ అవుతుంది. నదికి సుమారు 15 కిలోమీటర్ల మేర అవతలి వైపున కర్నాటక రాష్ట్రంలోని గంజిపల్లి, దేవసూగూరు, కొర్తికొండ, ఆత్కూరు గ్రామాలు ఉన్నాయి. ఇవతలి వైపు కృష్ణా, వాసునగర్, ముడుమాల్, పస్పుల, అంకెన్‌‌‌‌పల్లి, టైరోడ్‌‌‌‌ ప్రాంతాలు ఉన్నాయి. టైరోడ్డు సమీపంలో కృష్ణా నదిని ఆనుకొని ఉన్న ఓ ఆశ్రమం నుంచి ఇసుక మాఫియా నదిలోకి దిగుతోంది. ఓ పొలిటికల్‌‌‌‌ లీడర్‌‌‌‌ కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రమం వద్ద నది మీది నుంచి ఐదారు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డును నిర్మించారు. నదిలో నీళ్లు లేక ఇసుక మేటలు తేలడంతో వాటిని అక్రమంగా తరలించేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హిటాచీలను నదిలోకి దింగి ఇసుకను తోటి టిప్పర్లలో నింపుతున్నారు. అనంతరం ఇదే మార్గం గుండా కర్నాటకకు తరలించుకుపోతున్నట్లు సమాచారం. నది ఒడ్డున పెద్ద మొత్తంలో ఇసుక డంపులు ఉన్నాయి.

మట్టి రోడ్డుపైకి నీరు రాకుండా తూములు

మట్టి రోడ్డు మీదకు నీరు రాకుండా ఇసుక మాఫియా పక్కా ప్లాన్‌‌‌‌ ప్రకారం రోడ్డు నిర్మించింది. నీళ్లు అవతలికి వెళ్లేలా అక్కడక్కడ చిన్న చిన్న తూములను ఏర్పాటు చేసి, వాటి మీది నుంచి రోడ్డు వేశారు. ఒక వేళ ఊట నీరు వచ్చినా, నదికి స్వల్పంగా వరద వచ్చినా ఈ తూముల ద్వారా నీరు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం నదిలో పెద్ద మొత్తంలో తవ్వకాలు చేపట్టడంతో నదిలో ఎక్కడపడితే అక్కడ గోతులు ఏర్పడ్డాయి. భారీ స్థాయిలో తవ్వకాలు జరగడంతో నదీ ప్రాంతమంతా కళావిహీనంగా మారింది.

పట్టించుకోని ఆఫీసర్లు

ఇసుక మాఫియా కృష్ణా నదిలో కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు వేసినా అడిగే దిక్కులేకుండా పోయింది. ఈ వ్యవహారం గురించి ‘వెలుగు’ ఓ ఆఫీసర్‌‌‌‌ వివరణ కోరే ప్రయత్నం చేయగా.. అసలు మీరెందుకు అక్కడికి వెళ్లారని తిరిగి ప్రశ్నించడం గమనార్హం.

దీనికి సంబంధించిన వివరాలు మరో ఆఫీసర్‌‌‌‌ను అడగండి అంటూ ఒకరిపై ఒకరు నెట్టేసుకునే ప్రయత్నం చేశారు. ఆఫీసర్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఓ పొలిటీషియన్‌‌‌‌ ఈ దందాలో ఇన్‌‌‌‌వాల్వ్‌‌‌‌ కావడం వల్లే ఆఫీసర్లు సైలెంట్‌‌‌‌గా ఉంటున్నారని 
తెలుస్తోంది.

వారం కిందే విజిట్​ చేశాం 

నేను కొత్తగా వచ్చాను. వారం కిందట మైన్స్‌‌‌‌, రెవెన్యూ, పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధ్వర్యంలో కృష్ణానదిని విజిట్‌‌‌‌ చేశాం. అక్కడ ఎలాంటి రోడ్డు లేదు. ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు. చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా ఎంక్వైరీ చేశాం. వాళ్లు ఈ రోడ్డును రెండేండ్ల కింద వేశారని చెప్పారు. మండలంలో లీగల్‌‌‌‌గా ఇసుక రీచ్‌‌‌‌లు లేవు. ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలను సీజ్‌‌‌‌ చేసి, కేసులు నమోదు చేస్తాం.- వెంకటేశ్, తహసీల్దార్‌‌‌‌, కృష్ణ మండలం, నారాయణపేట జిల్లా

వికారాబాద్​ సర్వేయర్​ వెళ్లారు
 
విజిట్‌‌‌‌కు రావాలని నాకు చెప్పారు. కానీ నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పర్యటన వల్ల నేను వెళ్లలేకపోయాను. దీంతో వికారాబాద్‌‌‌‌ జిల్లాకు చెందిన సర్వేయర్‌‌‌‌ను పంపించాం. నదిలో ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయలేదని ఆయన చెప్పారు.  - సంజయ్, మైన్స్‌‌‌‌ ఏడీ, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌