- ఇసుక కోసం చెక్‌డ్యామ్‌లు కూలుస్తున్రు
- పాలమూరులో రెచ్చిపోతున్న సాండ్ మాఫియా
- ఫిల్టర్ ఇసుక తయారీకి చెక్‌డ్యామ్ ల వెనుక తవ్వకాలు
- భారీ గుంతలతో వరదలు వచ్చినప్పుడు డ్యామ్ లకు కోత
- టిప్పర్లతో ఇసుక తరలిస్తుండడంతో పంటపొలాలు ఆగమాగం
- లబోదిబో మంటున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు : సాగునీటి వనరులు, భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతో వాగులపై కట్టిన చెక్‌డ్యామ్‌లు ఇసుకమాఫియా దెబ్బకు కూలిపోతున్నాయి. ఫిల్టర్ఇసుక తయారీ మట్టి కోసం అక్రమార్కులు డ్యామ్దగ్గరలో భారీ గుంతలు తవ్వడంతో ఇటీవల వచ్చిన వరదలకు డ్యామ్కట్టలు కోతకు గురై దెబ్బతింటున్నాయి. 20 ఫీట్ల లోతు వరకు జేసీబీలతో గుంతలు తవ్వుతుండడంతో నీరు నిలవకుండా దగ్గరలోని బోర్లు ఎండిపోతున్నాయి. పొలాల వెంట ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తరలిస్తుండడంతో పంటలు దెబ్బ తింటున్నాయని రైతులు వాపోతున్నారు.
మూడేళ్లుగా.. ఇదే తంతు..
జిల్లాలో మూడేళ్లుగా ఏటా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్నెలల్లో రికార్డు స్థాయిలో వానలు పడుతుండడంతో వాగులు జోరుగా పారుతున్నాయి. వీటి మీద నిర్మించిన చెక్ డ్యామ్‌లు అలుగు పోయడంతో దాని వెనుక భాగంలో భారీ ఎత్తున నల్లమట్టి పేరుకుపోతోంది. దీంతో అక్రమార్కులకు వాగుల్లో ఇసుక తవ్వడం కష్టమై ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నారు. దుందుభి నది పారే నవాబ్‌పేట, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో గతంలో ఇసుక తవ్వకాలు బాగా జరిగేవి. ఇప్పుడు ఈ నంది నిండుగా నీళ్లుండడంతో ఇసుక తోడలేని పరిస్థితి. దీంతో నదీ పరివాహక వాగుల చెక్ డ్యామ్‌ల వెనుక భాగంలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఫిల్టర్ఇసుక తయారు చేస్తోంది. రైతుల పొలాల నుంచి నేరుగా ట్రాక్టర్లను వాగుల్లోకి దింపి జేసీబీలతో నల్లమట్టిని తవ్వి ట్రాలీల్లోకి నింపుతున్నారు. అక్కడే ఏర్పాటు చేసుకున్న పవర్‌బోర్లు, చెక్ డ్యామ్‌ల నిల్వ ఉన్న నీటితో మట్టి పోయి.. ఇసుక వచ్చేంత వరకు ఫిల్టర్ చేస్తున్నారు. ఇలా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోటకదిర, నవాబ్‌పేట మండలంలోని కారూర్, మల్లారెడ్డిపల్లి, రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్ ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల వెనుక ఫిల్టర్ ఇసుక కోసం తవ్వకాలు చేయడంతో చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి.
పోలీస్, రెవెన్యూ శాఖల అండతోనే..
ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్‌కు రూ.18 వేలు, టిప్పర్‌కు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు విక్రయిస్తున్నారు. ఒక టిప్పర్ బయటకు వచ్చిందంటే రూ.10 వేల వరకు పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొందరికి అక్రమార్కులు ముట్టజెపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందాలో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి లీడర్లు ఉండడంతో టిప్పర్ వస్తుందని ముందే పోలీసులకు ఫోన్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. ఫలానా ఏరియాకు వెళ్తుందని చెబుతుండటంతో ఆ ఏరియాలో పోలీసులు ఎవరు ఉండకుండా చూసుకుంటున్నారు. టిప్పర్లు వెళ్తున్న విషయాన్ని యువకులు పోలీసులకు సమాచారం ఇస్తే ‘సరే పట్టుకుంటాం’ అని చెప్పి, తర్వాత ఆ యువకుల ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. చెక్ డ్యామ్‌ల వద్దకు వెళ్లి యువకులు అక్రమార్కులను నిలదీస్తే వార్నింగ్‌లు ఇస్తున్నారు.
పంట పొలాలు ఆగమాగం..
జడ్చర్ల క్లస్టర్ పరిధిలో 84,019 మంది రైతులు 1.29 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మక్క, జొన్న పంటలు వేసుకున్నారు. ఇందులో మెజార్టీ పంటలు దుందుభికి సమీపంలో ఉన్నాయి. అయితే, అక్రమార్కులు ఫిల్టర్ చేసిన ఇసుకను రైతుల పొలాల మీదుగా తీసుకుపోతున్నారు. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫిల్టర్ చేసిన ఇసుకను రైతుల పొలాలకు సమీపంలో డంప్ చేస్తున్నారు. రాత్రి కాగానే టిప్పర్లను తీసుకొచ్చి బార్డర్లు దాటిస్తున్నారు. రోజుకు కనీసం ఒక్కో ఏరియా ఉంచి పది టిప్పర్లను పొలాల నుంచి తరలిస్తుండడంతో వ్యవసాయ భూములు కుంగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
అడ్డగోలుగా తవ్వుతున్నరు..
ఫిల్టర్ ఇసుక కోసం దుందుభిలో ఎట్లపడితే అట్ల అడ్డగోలుగా తవ్వుతున్నారు. మా దగ్గరున్న కారూర్ చెక్ డ్యామ్‌వద్ద భారీగా మట్టి తవ్వడంతో చెక్ డ్యామ్ బెడ్ కూడాకూలిపోయింది. రాత్రి వేళల్లో పొలాల వెంట టిప్పర్లు తిరుగుతుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. నీళ్లు ఆగకపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి.
- ముకుందం, రైతు, కారూర్
బైండోవర్ చేస్తున్నాం..
ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న ప్రాంతాలపై ఫోకస్పెట్టాం. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని, ఆయా మండలాల తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశాం. మాతో పాటు సీసీఎస్ పోలీసులు కూడా కేసులు పెడుతున్నారు. ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- జములప్ప, రూరల్ సీఐ, జడ్చర్ల