సాలూర మండలాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది

సాలూర మండలాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది
  • బోధన్, సాలూర మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక దందా 
  • ఇసుక మాఫియా మధ్య ఘర్షణలు 
  • అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం 

బోధన్​, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూర మండలాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రోజూ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు.  బోధన్​ మండలంలోని ఖండ్​గావ్​, సిద్దాపూర్​, కల్దుర్కి,  బిక్​నెల్లి,  హంగర్గా, సాలూర మండలంలోని మందర్నా, హున్సా గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మంజీర పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నారు. అక్రమ ఇసుక రవాణా విషయంలో మాఫియా మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా.. అధికారులు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. 

ఇసుక మాఫియా మధ్య ఘర్షణలు

మార్చి  26న రాత్రి బోధన్​ పట్టణ శివారులోని బాబా గార్డెన్​ వద్ద ఒక వర్గం వారు ఇసుక టిప్పర్లను ఆపడంతో మరో వర్గం  వారు మా టిప్పర్లు ఆపడానికి మీకేమీ అధికారం ఉందని ఒకరిపై ఒకరు  దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్​ హాస్పిటల్​కు తరలించారు.  దీంతో బోధన్​ పట్టణ పోలీస్​స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. ఇసుక మాఫియా మధ్య దాడులు జరుగుతుండడంతో బోధన్ రూరల్​ పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.  నామమాత్రంగా తనిఖీలు చేస్తూ రెండు  ట్రాక్టర్లు, మూడు టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కుతరలించారు. 

తెలిసే జరుగుతోందా..

అక్రమ ఇసుక రవాణా విషయంలో  రెవెన్యూ, పోలీసుల అండదండలున్నాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.  రెవెన్యూ, పోలీసు  అధికారులకు నెలనెలా మామూళ్లు ఇవ్వడంతోనే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సార్లు స్థానిక గ్రామాల ప్రజలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులపైనే ఇసుక మాఫియా దాడులు చేస్తోంది. 

స్థానిక అధికారులకు రాత్రివేళలో ఫోన్ చేసి సమాచారం అందించినా సరేనని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.  మంజీర నది నుంచి అక్రమ ఇసుకరవాణా తరలించడంతో భూగర్భజలాలు తగ్గిపోయి బోరుబావుల్లో నీటిశాతం తగ్గిపోతోందని  రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  అక్రమ ఇసుక  రవాణా  అడ్డుకోవాలని స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్​కు, ఆర్డీవోకు ఇప్పటికే ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు  రావడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను ఆపకపోతే ఆందోళన చేపడతామని ఆయా గ్రామస్థులు హెచ్చరించారు.