- వేములవాడ రూరల్ మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా
- ఇసుక తవ్వకాలతో వాగులో గుంతలు
- భూగర్భజలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన
- రెండు రోజుల కింద ఇసుక రవాణాను అడ్డుకున్న మల్లారం గ్రామస్తులు
వేములవాడరూరల్, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని మల్లారం సమీపంలోని మూలవాగు నుంచి ఇసుక తోలకాలతో గుంతలు ఏర్పడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కింద రెవెన్యూ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారని వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
కోతకు గురవుతున్న పంట భూములు
ఇసుక తవ్వకాలతో వేములవాడ రూరల్ మల్లారం మూలవాగు పక్కనే ఉన్న వందల ఎకరాల భూములు కోతకు గురవుతున్నాయి. ఏడు నెలల్లో మల్లారం గ్రామంలోని మూలవాగు నుంచి వేలాది ట్రాక్టర్ల ఇసుక తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు అనుమతుల ఇవ్వడం వల్లే యథేచ్ఛగా తోలకాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వానకాలంలో ఆకస్మాత్తుగా వస్తున్న వరదలతో పొలాలు కోతకు గురవుతున్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఇసుక తవ్వకాలతో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి.
బోర్లు అడుగంటుతున్నాయి
మల్లారం మూలవాగులో నుంచి కొన్ని నెలలుగా వేలాది ట్రిప్పుల ఇసుకను తరలించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరు అందించలేదని దుస్థితి. అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలి. లేకపోతే మూలవాగు నుంచి ఇసుక తీయకుండా గ్రామస్తులు, రైతులం కలిసి అడ్డుకుంటాం.
- తీపిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు, మల్లారం
తీవ్రంగా నష్టపోతున్నాం
ఇసుక తవ్వకాలతో వాగులో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో సమీపంలోని పొలాలు కోతకు గురవుతున్నాయి. బోర్లు, బోరు మోటార్లు వాగులోనే కుంగిపోయే అవకాశం ఉంది. మా పొలాలను కాపాడుకునేందుకు ఇక నుంచి గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను తిరగనీయం.
- మార్ముకం లచ్చయ్య, రైతు, మల్లారం