
- అదనపు బకెట్లతో అదనపు వసూళ్లు
- వే బ్రిడ్జి లేకుండానే రీచ్ ల నిర్వహణ
- ఇన్నాళ్లు పట్టించుకోని మైనింగ్, రవాణా శాఖ అధికారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఊటూరు విలేజీ పరిధిలో నిర్వహిస్తున్న ఇసుక రీచుల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా లోడ్ చేస్తున్నారు. తూకం వేసేందుకు వే బ్రిడ్జిని ఏర్పాటు చేయకుండా.. లారీల్లో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీబీ బకెట్ల లెక్కతో లారీల్లో ఇసుక పోస్తూ.. అదనపు బకెట్లకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. మైనింగ్, రవాణా శాఖ ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం, చూసీచూడనట్లు వ్యవహరించడంతో సదరు కాంట్రాక్టర్లు అదనపు బకెట్లతో సర్కార్ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఊటూరు విలేజీలో నిరుడు ఆగస్టు నుంచి ఇసుక రీచ్ లు ప్రారంభవ్వగా.. టీజీఎండీసీ అధికారిక లెక్కల ప్రకారం ఊటూరు విలేజీ 2లో 4,901 ఆర్డర్స్ రాగా 1,55,950 టన్నుల ఇసుక, ఊటూరు విలేజీ 1 బ్లాక్ 2లో 332 ఆర్డర్స్ రాగా 10,487 టన్నుల ఇసుక, ఊటూరు విలేజీలో 1 బ్లాక్ 1లో 37 ఆర్డర్స్ రాగా 1,103 టన్నుల ఇసుకను అమ్మినట్లు తెలుస్తోంది. కానీ వేబ్రిడ్జి లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని వేలాది అదనపు బకెట్ల ఇసుకను లారీల్లో పోసి తరలించారనే విమర్శలు వినిస్తున్నాయి.
వేబ్రిడ్జి లేకుండా అనుమతులెట్లా?
ఊటూరు విలేజీ పరిధిలో మూడు స్టాక్ యార్డులను ఏర్పాటు చేశారు. ఊటూరు విలేజీ 2, ఊటూరు విలేజీ 1 బ్లాక్ 2, ఊటూరు విలేజీలో 1 బ్లాక్ 1 పేర్లతో ఈ స్టాక్ యార్డులను నిర్వహిస్తున్నారు. టీజీఎండీసీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న లారీలు స్టాక్ యార్డులో ఇసుక లోడ్ చేసిన తర్వాత అక్కడే సీసీ కెమెరాల నిఘాలో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిలో కాంటా వేయాల్సి ఉంటుంది. లారీ టైర్ల సంఖ్యను బట్టి నిర్ణీత లోడ్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.
కానీ ఈ రీచుల్లో వే బ్రిడ్జి ఏర్పాటు చేయకుండ లారీలను పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు బకెట్ ఇసుక పోసి అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేసుకునేందుకే వేబ్రిడ్జిని ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీణవంక మండలం చల్లూరు ఇసుక రీచ్ లో వేబ్రిడ్జి ఉన్నప్పటికీ.. దాని పనితీరుపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. అంతేగాక ఈ రీచ్ ల నుంచి ఒక పర్మిట్‌తో మూడు, నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇన్నాళ్లు పట్టించుకోని మైనింగ్, రవాణా శాఖ అధికారులు
వేబ్రిడ్జి ఉండాలనే నిబంధనను ఇసుక రీచ్ నిర్వాహకులు ఉల్లంఘించడంపై మైనింగ్, రవాణా శాఖ ఆఫీసర్లు మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక దందా విషయంలో స్వయంగా సీఎం, సీఎస్ ఆదేశాలు ఇచ్చే వరకు సదరు అధికారులు ఇసుక రీచుల్లో తనిఖీలు నిర్వహించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజా తనిఖీల్లో కూడా హడావుడి తప్పితే వేబ్రిడ్జి లేకపోవడాన్ని తప్పుపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.